Google Bard | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ చాట్‌బోట్ టూల్ చాట్‌జీపీటీ ఇప్పుడు పాపులర్ సెర్చింజన్‌గా మారుతున్నది. దీంతో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సెర్చింజన్‌గా నిలిచిన గూగుల్, దాని పేరెంట్ సంస్థ అల్ఫాబెట్ అప్రమత్తం అయ్యాయి. చాట్‌జీపీటీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టింది. అయితే, చాట్‌జీపీటీ టూల్ ప్రస్తుతానికి ఆఫ్‌లైన్‌లోనే సేవలందిస్తున్నది. అది ఆన్‌లైన్‌లోకి రావడానికి ముందే సొంతంగా అభివృద్ధి చేసిన చాట్‌బోట్ `బార్డ్`ను ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ టూల్ ప్రమోషన్ కోసం రూపుదిద్దుకున్న ప్రమోషనల్ వీడియోలో చోటు చేసుకున్న చిన్న పొరపాటు.. గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్ల పతనానికి దారి తీసింది.
దీని సాకుగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీరును కంపెనీ ఉద్యోగులు తప్పుబడుతున్నారని, ఆయనను ఎగతాళి చేస్తూ మీమ్స్ తయారుచేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. బార్డ్ ప్రకటన తొందరపాటు చర్య అని పలువురు ఉద్యోగులు అంతర్గతంగా చెబుతున్నారు. తొందరపాటు, డూప్లికేట్, అన్గూగ్లీ అని పేర్కొంటున్నారని తెలుస్తున్నది. ఏదైనా కంపెనీ నిర్ణయాలపై ఉద్యోగులు తమ అభిప్రాయాలను మీమ్స్ రూపంలో తెలియజేస్తుంటారు. కానీ ఈదఫా కంపెనీ సీఈవోపైనే మీమ్స్ వెలువడటంతో సుందర్ పిచాయ్ నిజంగానే బార్డ్ ప్రకటనపై తొందరపడ్డారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఉద్యోగుల లేఆఫ్స్, బార్డ్ చాట్‌బోట్ ప్రకటన తొందరపాటు నిర్ణయాలని అంటున్నారు. గత నెల 12 వేల మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. లేఆఫ్ ప్రకటనకు ముందు ఉద్యోగులతో సమావేశమైన సుందర్ పిచాయ్ వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. నాటి ఆయన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు.. `తొందరపాటు నిర్ణయాలతో ఇటువంటి ఫలితాలే వస్తాయి`, `బార్డ్ ఆవిష్కరణ, లేఆఫ్స్ ప్రకటన తొందరపాటు నిర్ణయాలే.. దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్ చేయండి` అని మీమ్స్‌లో పేర్కొంటున్నట్లు తెలుస్తున్నది. గతవారం బార్డ్ ఆవిష్కరణ కోసం రూపొందించిన ప్రమోషనల్ వీడియోలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌పై అడిగిన ప్రశ్నకు తప్పుడు జవాబిచ్చింది. ఫలితంగా ఆల్ఫాబెట్ స్టాక్స్ 8 శాతం వరకు నష్టపోయాయి.