Sunglasses | వేసవిలో బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతాం. ఎండ ప్రచండంగా ఉంటుంది. అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను కాపాడేందుకు చాలామంది చలువ కళ్లద్దాలను ఎంచుకుంటారు. అయితే, ఇప్పుడు ైస్టెలిష్‌గా కనిపిస్తూనే సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి సులోచనాలు. ఈ స్మార్ట్ సన్‌గ్లాసెస్‌తో ఫొటోలు, వీడియోలు తీయొచ్చు. పాటలు వినొచ్చు. ఫోన్లు మాట్లాడొచ్చు. రేబాన్, బోస్, అమెజాన్‌లాంటి సంస్థలు వీటి తయారీలో మునిగితేలుతున్నాయి. ఆ కాలా చష్మా సంగతులేంటో కనుక్కుందాం..
కొత్తతరానికి తగ్గట్టు అద్దాలను అప్డేట్ చేయడంలో రేబాన్ కంపెనీ ముందుంటుంది. ఇటీవలే అధునాతన ఫీచర్లతో హైటెక్ చలువజోళ్లను తయారుచేసింది. ‘రేబాన్ స్టోరీస్ స్మార్ట్ గ్లాసెస్’ పేరిట ఫేస్బుక్ ఆధారిత టెక్నాలజీతో రూపొందిన ఈ స్పెక్ట్స్.. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ అవుతాయి. ఈ జోళ్లకు పైన మూలల్లో రెండు వైపులా 5 మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రేమ్ మీద టచ్ చేయడం ద్వారా ఈ కెమెరాలతో ఫొటోలు, ఒక నిమిషం నిడివి వీడియోలు తీసుకోవచ్చు. వెలుతురును బట్టి సర్దుబాటు చేసుకుంటూ స్పష్టమైన చిత్రాలు తీసేలా తయారు చేశారు వీటిని.
సోషల్ మీడియా సంస్థ స్నాప్‌చాట్ కూడా టెక్నాలజీని అనుసంధానిస్తూ కూలింగ్ గ్లాసెస్ తయారుచేసింది. చుట్టూ ఉన్న పరిసరాలను త్రీడీ రూపంలో చిత్రీకరించడం వీటి ప్రత్యేకత. ‘స్నాప్ స్పెక్టకిల్స్3’ పేరిట ఈ ఉత్పత్తులను తీసుకొచ్చారు. ఇందులో రెండు హైరెజల్యూషన్ కెమెరాలు పెట్టారు. మంచి క్వాలిటీతో సౌండ్ రికార్డ్ చేసేందుకు 4 మైక్రోఫోన్లు ఉన్నాయి. వీటిని స్నాప్చాట్లోనో లేదా మరో సోషల్ మీడియా మాధ్యమంలోకో అప్లోడ్ చేయవచ్చు. మీరు నడుస్తున్న దారిలోనే కొన్ని త్రీడీ ఎఫెక్ట్లు కనబడేలా సరదాగా కొన్ని ఫిల్టర్లూ అందుబాటులో ఉన్నాయి. చార్జింగ్ కేస్ ద్వారా కళ్లజోడును చార్జ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు చాలామందికి చెవిలో హెడ్సెట్ లేకపోతే తోచే పరిస్థితి లేదు. బ్లూటూత్ హెడ్సెట్లు, వైర్లెస్ ఇయర్ బడ్స్ వచ్చాక.. జనం వీటికి అతుక్కుపోయారనే చెప్పాలి. కానీ ఇయర్‌బడ్స్ మాత్రం చెవిని అతుక్కుని ఉండవు. బయటికి వెళితే నడిచేప్పుడో, పరిగెత్తేటప్పుడో చటుక్కున ఎక్కడన్నా పడిపోతుంటాయి. అందువల్ల వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. కానీ ‘టెక్కెన్ సన్‌గ్లాసెస్’ ఉంటే ఆ ఇబ్బంది ఉండదు. ఎండలో బయటికి వెళ్లాలన్నప్పుడు ైస్టెలిష్‌గా కనిపించే ఈ చలువ కళ్లద్దాలను పెట్టుకోవచ్చు. వీటితోపాటు చెవి పైభాగంలో కళ్లజోడు నుంచి ఇయర్‌బడ్స్‌ను అనుసంధానం చేసి ఉంటారు. చెవిలో పెట్టుకునేందుకు అనుకూలంగా వీటిని సర్దుబాటు చేసుకోవచ్చు. బ్లూటూత్‌తో అనుసంధానం చేసుకుని పాటలు వినొచ్చు, ఫోన్ మాట్లాడొచ్చు!
దిగ్గజ సంస్థ అమెజాన్ సైతం తన మార్కుతో చలువ కళ్లద్దాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కళ్లను పదునైన సూర్యకిరణాల నుంచి కాపాడుతూనే టెక్నాలజీ పరంగానూ వావ్ అనిపించేలా వీటిని రూపుదిద్దారు. నలుపు, నీలం రంగుల కలబోతగా ైస్టెలిష్‌గా కనిపించే వివిధ రకాల సన్‌గ్లాసెస్‌ను తీసుకువచ్చారు. అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో పనిచేస్తాయివి. పోడ్కాస్ట్లు, ఆడియో పుస్తకాలూ వినొచ్చు. పాటలు వింటూ పనిచేసుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న ధ్వనిని బట్టి సౌండ్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన యాప్‌ల సాయంతో సిరి వాయిస్ అసిస్టెంట్‌ను కూడా వినియోగించుకోవచ్చు. నోటిఫికేషన్ల చప్పుడు మాటిమాటికీ ఇబ్బంది పెడుతుందని అనుకుంటే ముఖ్యమైనవి మాత్రమే వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ కారణంగా సాధారణ సన్గ్లాసెస్లాగా రోజంతా వాడుకోవచ్చు.
హెడ్‌సెట్స్, స్పీకర్స్ విషయంలో బోస్కి ఎంత పాపులారిటీ ఉందో చెప్పక్కర్లేదు. ఇదే సంస్థ కళ్లజోడుకు తనదైన ప్రత్యేక ఫీచర్స్ జోడించి మార్కెట్లో తీసుకువచ్చినవే ‘బోస్ ఫ్రేమ్స్ ఆడియో సన్‌గ్లాసెస్’. ఫ్యాషన్ ప్రధానంగా వీటిని తయారుచేశారు. గుండ్రటి, చతురస్రాకార, దీర్ఘచతుర స్రాకార, క్యాట్ ఐ తదితర ఆకృతుల్లో చూడగానే ఆకట్టుకునేలా ఉంటున్నాయి. టెక్స్పెక్ట్స్ని తీసుకురావడంలో భాగంగా బోస్ వీటిలో తన ప్రత్యేకమైన మ్యూజిక్ ఫీచర్నీ జోడించింది. కళ్లజోడు పెట్టుకున్నప్పుడు చెవుల మీద ఉండే ఫ్రేమ్ వెనక భాగంలో స్పీకర్లు వచ్చేలా దీన్ని రూపొందించారు. అంటే, ఇవి చెవిలోపల ఉండకపోయినా మనం పాటలు వినొచ్చు. పరిసరాల పట్ల స్పృహతో ఉంటూనే సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఇతర ఆప్‌లతో అనుసంధానమయ్యే ఈ గ్లాసెస్ పుణ్యమాని.. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు జీపీఎస్ యాప్‌ల సాయంతో కావలసిన చోటికి సులభంగా ప్రయాణించవచ్చు.
“Naya Mall | సన్ గ్లాసెస్ విత్ ఉడెన్ టచ్.. అదిరిపోయిన లేటెస్ట్ గ్యాడ్జెట్”
“Naya Mall |ఈ స్మార్ట్ రింగ్ మీ హార్ట్ రేట్ కూడా చెప్పేస్తుంది”