పనిమీద ఊరెళ్లినప్పుడు, సాహసయాత్రల్లో భాగంగా కొండలూ కోనలూ తిరుగుతున్నప్పుడు మొబైల్ సిగ్నల్స్ దొరకడం గగనం. బయటి ప్రపంచంతో ఏదైనా అవసరం వచ్చినా, అత్యవసర సమయంలో మనం ఎక్కడున్నామో చెప్పాలనుకున్నా.. ఓ పట్టాన సాధ్యం కాదు. ఆ ఇబ్బందిని దూరం చేస్తూ మోటరోలా సంస్థ ‘డిఫై శాటిలైట్ లింక్’ అనే పరికరాన్ని తీసుకువచ్చింది. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ అవుతుందీ ఎక్విప్మెంట్. మనం భూమ్మీద ఏ ప్రాంతంలో ఉన్నా.. హాట్‌స్పాట్ ద్వారా శాటిలైట్ సిగ్నల్స్‌ను అందిస్తుంది. ప్రత్యేక యాప్‌లో సందేశాలూ పంపుకోవచ్చు. ప్రత్యేకించి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. motorolarugged.com వెబ్సైట్ ద్వారా ప్రీఆర్డర్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఈ వాటర్ ప్రూఫ్ పరికరాన్ని కీచెయిన్గానూ వాడుకోవచ్చు. ధర సుమారు రూ.12,300.
చేతి గడియారం ఎప్పుడూ సమయమే చెప్పాలా? కాస్త అందంగా, ఇంకాస్త స్మార్ట్‌గా ఉంటే సరిపోదా? అందుకే, ‘నోవాచ్’ సంస్థ సరికొత్త వాచీలను పరిచయం చేస్తున్నది. ఇవి అచ్చంగా వాచీల్లాగే ఉంటాయి. డయల్ భాగంలో మాత్రం రత్నాలో, వజ్రాలో కనిపిస్తాయి. అంటే, వాచీలా కనిపించే బ్రేస్లెట్ అన్నమాట. స్మార్ట్వాచీలా మనం వేసిన అడుగులు, గుండెవేగం, రక్తపోటు, నిద్ర.. తదితర విషయాలన్నీ సెల్‌ఫోన్‌కు చేరవేస్తాయి. ైస్టెల్ ప్లస్ హెల్త్.. దీని ప్రత్యేకత! డయల్, డిజైన్, బెల్టు మనమే ఎంచుకోవచ్చు. nowatch.com వెబ్సైట్లో ఆర్డర్ చేయవచ్చు. ధర సుమారు రూ. 41 వేలు.
హై పర్ఫార్మెన్స్ బైక్‌లను తయారుచేసే కేక్ సంస్థ ఇటీవల సరికొత్త ఇ-బైక్ సిరీస్ తీసుకువచ్చింది. కొరియర్ బాయ్‌లు, కార్పెంటర్లు, బ్యుటీషియన్లు, మెకానిక్‌లు, ప్లంబర్లు… ఇలా వివిధ పని ముట్లను వెంట తీసుకెళ్లే వారికి పనికొచ్చేలా డిజైన్ చేశారు. ఈ బైక్‌లు 245 కేజీల దాకా బరువు మోస్తాయి. వీటి బ్యాటరీలతో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెట్టుకోవడమే కాదు డ్రిల్లింగ్ మెషిన్లు, వెల్డింగ్ మెషిన్లను కూడా అనుసంధానం చేసుకోవచ్చు. బ్యాటరీని తీసి వీలున్న చోట ఛార్జింగ్ పెట్టుకుని తిరిగి ఫిక్స్ చేసుకునే వెసులుబాటూ ఉంది. స్మార్ట్‌గా ఉంటాయి కాబట్టి, ట్రాఫిక్‌లో సులభంగా దూసుకుపోవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెడితే 100 నుంచి 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బరువులు లాక్కెళ్లేందుకు అనువుగానూ రూపొందించారు. లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ridecake.com సంస్థ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ధర సుమారు రూ. 5.35లక్షలు.
Torch Fire Sensor
సాధారణ గృహాల నుంచి పెద్దపెద్ద భవంతుల వరకూ.. ఏదీ అగ్ని ప్రమాదాలకు అతీతం కాదు. ఆ ఇబ్బందిని పసిగట్టగలిగేలా ‘టార్చ్ ఫైర్ సెన్సర్లు’ రూపొందుతున్నాయి. ఇందులోని ఇన్ఫ్రారెడ్ కెమెరాలు, సాధారణ కెమెరాలు, గ్యాస్ సెన్సర్లు.. చుట్టుపక్కల ఎక్కడైనా నిప్పు అంటుకున్నా, షార్ట్ సర్క్యూట్ జరిగినా వెంటనే పసిగట్టి ఫోన్ ద్వారా అప్రమత్తం చేస్తాయి. దీంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చు. దీనిపై ఉండే సోలార్ ప్యానెల్ ద్వారా ఛార్జింగ్ చేసుకుంటే చాలు. 24 గంటలు పనిచేస్తుందీ పరికరం. torchsensors.com సంస్థద్వారా కొనుక్కోవచ్చు. ధర రూ. 25 వేలు.