Solar Storm | సౌర తుఫాను భూమి వైపు దూసుకువస్తున్నది. ఇవాళ భూమిని ఢీకొట్టే అవకాశాలున్నాయని స్పేస్వెదర్ (Spaceweather.com) వెల్లడించింది. సూర్యుడి నుంచి వెలువడిన కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME) శనివారం వెలువడిందని.. ఇది ఆదివారం భూమిని తాకే అవకాశాలున్నాయని పేర్కొంది. అయితే, దీనిపై భూమిపై ఉన్న జీవానికి ఎలాంటి ముప్పు కలిగే అవకాశం లేదని, తేలికపాటి భూ అయస్కాంత తుఫానుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, తుఫాను కారణంగా విద్యుత్ గ్రిడ్లు, నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్లలో చిన్న చిన్న అంతరాయాలు కలిగే అవకాశాలున్నాయని తెలిపింది.
సూర్యుడిపై భారీ విస్పోటనాలు జరుగుతుంటాయి. ఆ తర్వాత కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడుతుండగా.. విశ్వంలోకి ప్రయాణిస్తుంటాయి. గత నెల ఆగస్టు 30న ‘కానియన్ ఆఫ్ ఫైర్’ మ్యాగ్నెటిక్ ఫిలమెంట్ విస్పోటనం తర్వాత సూర్యుడి నుంచి సౌర తుఫానులు ప్రారంభమయ్యాయి. వీటి ప్రభావం పెద్దగా కనిపించనప్పటికీ.. భూ అయస్కాంత తుఫానులకు దారి తీసే అవకాశాలుంటాయి. సౌర తుఫాను కారణంగా అమెరికాలోని న్యూయార్క్, మిన్నెసోటా, వాషింగ్టన్, ఉత్తర అమెరికా రాష్ట్రాల్లో పలుచోట్ల అరోరాలు కనిపించే అవకాశాలున్నాయని ఓ నివేదిక తెలిపింది. ఇంతకు ముందు నాసాకు చెందిన సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ (SOHO) సెప్టెంబర్ ఒకటిన సూర్యుడి నుంచి ఓ ప్రకాశవంతమైన పసుపు వర్ణంలో ఉన్న మెరుపు వెలువడినట్లు నివేదిక పేర్కొంది.
సూర్యుడిపై భారీ పేలుళ్ల కారణంగా ఇవి ఏర్పడుతుంటాయి. సూర్యుడి నుంచి శక్తి ఆవేశిత కణాల రూపంలో విశ్వంలోకి ప్రయాణిస్తుంటాయి. సోలార్ సైకిల్ ప్రతీ 11 ఏళ్లకు ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడి ధ్రువాలు మారుస్తూ వస్తుంటాయి. ఉత్తర ధ్రువం దక్షిణంగా.. దక్షిణ ధ్రువం ఉత్తరంగా మారుతాయి. ఈ సమయంలో మాగ్నిటిక్ ఫీల్డ్ గందరగోళంగా పరిస్థితి ఏర్పడి.. భారీగా పేలుళ్లు జరుగుతుంటాయి. ప్రస్తుతం సూర్యుడు తన చక్రంలో తారాస్థాయికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో తుఫాన్లు ఎక్కువయ్యాయి. అయితే, భూమిని సౌర తుఫాను తుఫాను తాకినా.. భూమికి సహజంగా ఉన్న మ్యాగ్నిటిక్ ఫీల్డ్ వాటిని అడ్డుకుంటుంది. సౌర తుఫానుల కారణంగా భూమిపై మానవులతో పాటు జీవజాలానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. రేడియో సిగ్నల్స్, శాటిలైట్లు, విద్యుత్ గ్రిడ్స్కు ముప్పు కలిగే అవకాశాలుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.