Realme Narzo 80 Lite 4G | ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా రియల్‌మి కూడా ఓ నూతన బడ్జెట్ ఆండ్రాయిడ్ 4జి స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందించడంతోపాటు ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. నార్జో 80 లైట్ 4జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను రియల్ మి లాంచ్ చేసింది. గత వారంలో సి71 పేరిట ఓ బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేయగా ఇప్పుడు ఈ ఫోన్‌ను రియల్‌మి లాంచ్ చేసింది. ఇందులో 6.7 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫోన్లో యూనిసోక్ టి7250 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్ లభిస్తుంది. అదనంగా మరో 12 జీబీ వరకు ర్యామ్ ను వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉండగా ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు గాను ఐపీ54 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్‌పై నీటి బిందువులు పడినా వెంటనే స్క్రీన్‌పై నుంచి కిందకు జారుతాయి. నీటి నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఈ ఫోన్‌కు గాను వెనుక భాగంలో వెలిగే పల్స్ లైట్‌ను ఇచ్చారు. దీన్ని 5 రకాలుగా మార్చుకునే వీలు కల్పించారు.
ఈ ఫోన్‌కు ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ కింద పడినా అంత సులభంగా పగలదు. 1.8 మీటర్ల ఎత్తు నుంచి ఫోన్‌ను కింద పడేసినా పగలని విధంగా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. ఇక ఇందులో 6300 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే 6 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ ఫీచర్ కూడా లభిస్తుంది. దీని సహాయంతో ఇతర ఫోన్లను కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. 2టీబీ వరకు స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌లతోపాటు ఒక మైక్రో ఎస్డీ కార్డు స్లాట్‌ను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. ఫోన్‌కు కింది వైపు స్పీకర్లను అమర్చారు.
ఈ ఫోన్లో 5జి లేదు. కేవలం 4జి సేవలను మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి ఫీచర్లను అందిస్తున్నారు. రియల్‌మి నార్జో 80 లైట్ 4జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.7299 ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8299 గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు రియల్‌మి ఆన్లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై తగ్గింపు ధరను అందిస్తున్నారు. రూ.700 కూపన్ కోడ్‌తో ఈ ఫోన్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.6599, రూ.7599 అవుతుంది.