Portronics Lithius Cell | టీవీలు, ఏసీలకు చెందిన రిమోట్లు, ఇతర అనేక పరికరాల్లో మనకు బ్యాటరీలు అవసరం అవుతుంటాయి. అవి రెండు రకాల సైజుల్లో ఉంటాయి. ఒకటి డబుల్ ఎ (AA) సైజ్ కాగా మరొకటి ట్రిపుల్ ఎ (AAA) సైజ్. ఈ క్రమంలోనే ఈ బ్యాటరీలు కలిగిన పరికరాలను వాడే కొద్దీ కొంతకాలానికి బ్యాటరీ లైఫ్ అయిపోతుంది. దీంతో ఆ బ్యాటరీలను మార్చాల్సి ఉంటుంది. అయితే అత్యవసర సమయంలో ఇలా బ్యాటరీలను మార్చాల్సి వస్తే అప్పుడు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే చాలా మంది ఈ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇవే బ్యాటరీలకు గాను రీచార్జబుల్ మోడల్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. కానీ వాటిని చార్జ్ చేసేందుకు సరైన చార్జర్లను మాత్రం ఎవరూ అందించడం లేదు. దీంతో ఈ బ్యాటరీల విషయంలో చాలా మందికి సమస్యలు ఎదరవుతున్నాయి. అయితే ఇకపై వినియోగదారులకు ఇలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే పోర్ట్రోనిక్స్ అనే కంపెనీ నూతన తరహా బ్యాటరీలను తాజాగా విడుదల చేసింది.
ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ పోర్ట్రోనిక్స్ భారత మార్కెట్లో తాజాగా సరికొత్త డబుల్ ఎ, ట్రిపుల్ ఎ బ్యాటరీలను లాంచ్ చేసింది. లిథియస్ సెల్ పేరిట యూఎస్బీ టైప్ సి కేబుల్‌తో చార్జింగ్ చేసుకోగలిగే డబుల్ ఎ, ట్రిపుల్ ఎ బ్యాటరీలను మార్కెట్లో ప్రవేశపెట్టారు. వీటిని లిథియం-అయాన్ టెక్నాలజీతో రూపొందించామని కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్న విషయం విదితమే. ఇవి త్వరగా చార్జింగ్ అవడమే కాకుండా ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఇదే టెక్నాలజీతో పోర్ట్రోనిక్స్ కంపెనీ డబుల్ ఎ, ట్రిపుల్ ఎ బ్యాటరీలను రూపొందించి విడుదల చేయడం విశేషం. ఈ బ్యాటరీను యూఎస్బీ టైప్ సి కేబుల్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందుకు గాను బ్యాటరీలపై నేరుగా ఓ యూఎస్బీ టైప్ సి పోర్టు ఉంటుంది. అందువల్ల చార్జింగ్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది కలగదు.
ఇప్పటి వరకు డబుల్ ఎ, ట్రిపుల్ ఎ బ్యాటరీలను ఒకసారి వాడితే వాటిని మళ్లీ కొత్తవి వేసి ఉపయోగించాల్సి వచ్చేది. ఇక రీచార్జబుల్ బ్యాటరీలు అయితే చార్జర్లు సరైనవి ఉండడం లేదు. కానీ పోర్ట్రోనిక్స్ రూపొందించిన ఈ లిథియస్ సెల్ బ్యాటరీలతో అలాంటి సమస్యలకు గురి కావల్సిన పనిలేదు. ఈ బ్యాటరీలను ఎప్పుడంటే అప్పుడు సునాయాసంగా చార్జింగ్ చేసి వినియోగించుకోవచ్చు. ఇక ప్రయాణాల్లో ఉన్నవారికి కూడా ఈ బ్యాటరీలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఈ బ్యాటరీలను చార్జింగ్ చేసుకునేందుకు వీటిపైనే నేరుగా యూఎస్బీ టైప్ సి పోర్టును ఇస్తుండడం వీటికి ఉన్న ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. దీనికి గాను ఎలాంటి చార్జర్లు, డాక్స్ అవసరం లేదు. ఒక యూఎస్బీ టైప్ సి కేబుల్ ఉంటే చాలు, చాలా సులభంగా ఈ బ్యాటరీలను చార్జింగ్ చేసుకోవచ్చు.
ఇక పోర్ట్రోనిక్స్ లిథియస్ సెల్ బ్యాటరీల్లో ఒక డబుల్ ఎ (AA) బ్యాటరీ 1480ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంది. అదే ట్రిపుల్ ఎ (AAA) అయితే ఒక బ్యాటరీ 440ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇక ఒక్కో బ్యాటరీ 1.5 వోల్టుల విద్యుత్ ఔట్‌పుట్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీలను యథావిధిగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు చెందిన రిమోట్లతోపాటు కంప్యూటర్ కీబోర్డులు, మౌస్‌లు, పిల్లల బొమ్మలు, కెమెరాలు, గేమింగ్ కంట్రోలర్లు, దీపాలు, గడియారాలు వంటి వాటిల్లో వేసి ఉపయోగించవచ్చు. ఒక్కో బ్యాటరీపై స్మార్ట్ ఎల్ఈడీ ఇండికేటర్ ఉంటుంది. దీని సహాయంతో బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అయిన విషయాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ బ్యాటరీలను పూర్తిగా లీక్ ప్రూఫ్ టెక్నాలజీతో రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. పలు రకాల లేయర్లలో ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. అలాగే షార్ట్ సర్క్యూట్ అవకుండా ప్రత్యేక ఫీచర్‌ను ఇచ్చారు. అధిక ఓల్టేజ్‌ను సైతం తట్టుకుంటాయి.
ఈ బ్యాటరీలకు సర్జ్ ప్రొటెక్షన్, ఓవర్ హీటింగ్ కంట్రోల్, ఓవర్ డిశ్చార్జ్ సెక్యూరిటీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. బ్యాటరీలను చార్జింగ్ పెట్టినప్పుడు వాటిపై ఉండే ఇండికేటర్ వెలుగుతూ, ఆరిపోతూ ఉంటుంది. అదే చార్జింగ్ ఫుల్ అయితే ఇండికేటర్ అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇక డబుల్ ఎ (AA) ఒక్క బ్యాటరీ ఖరీదు రూ.449 ఉండగా, ట్రిపుల్ ఎ (AAA) ఒక్క బ్యాటరీ ధరను రూ.499గా నిర్ణయించారు. ఈ బ్యాటరీలను Portronics అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. అలాగే అన్ని ప్రధాన ఈ-కామర్స్ సైట్లలో, ఇతర ఆఫ్ లైన్ స్టోర్స్‌లోనూ వీటిని విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది.