OPPO Reno14 5G Diwali Edition | దీపావళి పండుగ సందర్భంగా ఒప్పో కంపెనీ ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో రెనో14 5జి దీపావళి ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ రంగంలోనే మొదటి సారిగా హీట్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతకు అనుగుణంగా కలర్ మారుతుంది. అందుకు గాను ఫోన్ వెనుక వైపు గ్లో షిఫ్ట్ టెక్నాలజీ కలిగిన బ్యాక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఇది రేడియెంట్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. వాడే యూజర్ ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఈ ఫోన్ బ్యాక్ కలర్ మారుతుంది. ఈ ఫోన్ ఆయా ఉష్ణోగ్రతలకు భిన్నంగా స్పందిస్తుంది. 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను గుర్తిస్తే ఫోన్ బ్యాక్ ప్యానెల్ రంగు నలుపు రంగుకు మారుతుంది. 29 నుంచి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అయితే నలుపు నుంచి బంగారు రంగుకు మారుతున్నట్లు దర్శనమిస్తుంది. అదే 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతను గుర్తిస్తే ఫోన్ వెనుక వైపు పూర్తిగా బంగారు రంగులోకి మారి కనిపిస్తుంది.
ఈ ఫోన్లో 6.59 ఇంచుల ఫ్లాట్ ఓలెడ్ డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 1.5 కె రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను అందిస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్ ఉంది. 256జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే 50 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన మరో పెరిస్కోప్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు.
ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్ కూడా ఉంది. అందువల్ల ఈ ఫోన్‌ను యూనివర్సల్ రిమోట్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఇందులో సపోర్ట్ లభిస్తుంది. ఐపీ 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా లభిస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ సదుపాయం కూడా ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అమర్చారు. దీనికి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఈ ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
ఒప్పో రెనో 14 5జి దీపావళి ఎడిషన్ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999గా ఉంది. ఈ ఫోన్‌ను అన్ని ప్రధాన రిటెయిల్ ఔట్‌లెట్లతోపాటు, ఒప్పో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో విక్రయిస్తున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఆఫర్లను సైతం అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను కొన్నవారికి పలు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. రూ.3000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తున్నారు.