Asus Laptops | స్విగ్గీ.. ఈ పేరు చెప్పగానే మనకు ఫుడ్ డెలివరీ గురించి గుర్తుకు వస్తుంది. కానీ ఇకపై ఇందులో ల్యాప్‌టాప్‌లు కూడా లభ్యం కానున్నాయి. స్విగ్గీతో భాగస్వామ్యం అయిన అసుస్ ఇండియా ఇకపై ఈ ప్లాట్ ఫామ్ ద్వారా వినియోగదారులకు ల్యాప్ టాప్‌లను కూడా డెలివరీ చేయనుంది. ఫుడ్ ఎలాగైతే కొన్ని నిమిషాల్లోనే డెలివరీ అవుతుందో ల్యాప్ టాప్ లను కూడా అలాగే డెలివరీ చేస్తారు. సాధారణంగా ఈ-కామర్స్ సైట్లలో ల్యాప్ టాప్‌లను ఆర్డర్ పెడితే 1 రోజు నుంచి కొన్ని రోజుల వరకు సమయం పడుతుంది. కానీ స్విగ్గీ ద్వారా ఇన్ స్టంట్ గా డెలివరీ పొందవచ్చు. స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేస్తే సాధారణ ల్యాప్ టాప్లతోపాటు గేమింగ్ ల్యాప్ టాప్‌లను కూడా డెలివరీ ఇస్తారు.
తమ ఉత్పత్తులను మరింత మంది వినియోగదారులకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అసుస్ ఇండియా వెల్లడించింది. అసుస్ ల్యాప్ టాప్‌లు కస్టమర్లకు అద్భుతమైన ప్రదర్శనను అందిస్తాయని అసుస్ ఇండియా కన్జ్యూమర్ అండ్ గేమింగ్ పీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్ సు తెలిపారు. స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌తో భాగస్వామ్యం అయి వినియోగదారులకు కొన్ని నిమిషాల్లోనే తాము కోరుకున్న ల్యాప్‌టాప్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయని, ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన వెంటనే డెలివరీని కోరుకుంటున్నారని, అందుకనే ఈ ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌తో భాగస్వామ్యం అవడం ద్వారా తమ ల్యాప్ టాప్‌లను మరింత మంది కస్టమర్లకు విక్రయించే అవకాశం ఉందన్నారు.
కాగా దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ల్యాప్ టాప్‌లను కొంటున్న వారి సంఖ్యలో అసుస్ 30 శాతం వాటాను కలిగి ఉందని ఆ సంస్థ వెల్లడించింది. స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ ద్వారా కస్టమర్లు అసుస్‌కు చెందిన పలు రకాల ల్యాప్ టాప్‌లను ఆర్డర్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ సేవలను హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, పూణె, కోల్‌కతాలలో అందిస్తుండగా, త్వరలోనే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా పలు రకాల ల్యాప్ టాప్‌లను కస్టమర్లకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
బడ్జెట్ ల్యాప్ టాప్ కావాలనుకుంటే కస్టమర్లు స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ లో అసుస్ వివో బుక్ గో 15ను ఆర్డర్ చేయవచ్చు. ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.33,990గా ఉంది. ఇందులో ఏఎండీ రైజెన్ 3 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. మిడ్ రేంజ్ ల్యాప్ టాప్ కావాలనుకుంటే అసుస్ వివోబుక్ 15 ను ఆర్డర్ చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ.50,990గా ఉంది. ఇందులో ఇంటెల్ కోర్ ఐ5 13వ జనరేషన్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ లభిస్తుంది. గేమింగ్ ల్యాప్ టాప్ కావాలనుకుంటే టీయూఎఫ్ గేమింగ్ ఎఫ్16ను ఆర్డర్ చేయవచ్చు. ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.74,990 ఉండగా, ఇందులో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 4జీబీ గ్రాఫిక్ కార్డు, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఇక అన్ని ల్యాప్‌టాప్‌లలోనూ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తోపాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2024 వెర్షన్ ఉచితంగా లభిస్తుంది.