NASA | విశ్వం తనలోనే ఎన్నో అద్భుతాలను దాచుకున్నది. గెలాక్సీలు ఎన్నో గ్రహాలు, నక్షత్రాలను తనలోనే ఇముడ్చుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా విశ్వం గుట్టువిప్పేందుకు శాస్త్రవేత్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. భూమిని పోలిన గ్రహాల కోసం అన్వేషిస్తున్నారు. అలాగే, ఇతర గ్రహాలు నీటి జాడల గురించి పరిశోధిస్తున్నారు. ఈ క్రమంలో నాసా శాస్త్రవేత్తల పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మార్స్-జుపిటర్ గ్రహాల మధ్య గ్రహశకలాల వలయంలో ఉన్న ‘సెరెస్’పై ఘనీభవించిన మహాసముద్రం ఉన్నట్లుగా గుర్తించారు. గతంలో ఈ గ్రహాన్ని మరుగుజ్జు గ్రహంగా భావించగా.. భూమిపై తరహాలోనే హమనీనదాలను గుర్తించారు.
సెరెస్ క్రేటర్ల ఆకృతులను విశ్లేషించగా.. ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతర మంచు ఖగోళ వస్తువులపై కాలక్రమేణా క్రేటరలన్నీ చదునుగా మారుతూ వస్తాయి. కానీ, సెరెస్పై క్రేటర్లు మాత్రం ఆకృతి మారలేదు. దీని కారణం ఉపరితలం కింద మందపాటి నీటి మంచు పొర క్రేటర్ గోడలు కుంగిపోకుండా నిరోధిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డాన్ మిషన్ సమాచారంతో ఈ మంచు పొరను గుర్తించినట్లుగా పరిశోధకుడు పమెర్లో పేర్కొన్నారు. ఇది స్థిరమైన, మందపాటి మంచు పొర ఉనికిని సూచిస్తుందని చెప్పారు. సెరెస్పై మంచు కేవలం నిశ్చలంగా ఉండడం లేదని.. భూమిపై హిమనీనదాలు కదిలినట్లుగా కదులుతోందని.. సుదీర్ఘకాలంలో ఒత్తిడికి గురైన సయంలో మంచు ఘనరూపంలోనే ప్రవహిస్తుందని తెలిపారు.
ఈ ప్రక్రియ కారణంగా క్రేటర్లలో కాలక్రమేణ లోతు తగ్గినట్లుగా కనిపిస్తాయని.. ఎంతటి ఘన పదార్థమైనా సుదీర్ఘ కాలంలో పవహిస్తుందని పరిశోధకుడు, పీహెచ్డీ విద్యార్థి పమెర్లో పేర్కొన్నారు. సెరెస్ అంతర్గత నిర్మాణం ఏకరీతిన లేదని.. పైపొరల్లో మంచి అధికంగా, లోతుకు వెళ్లే కొద్దీ రాతి పదార్థాల శాతం పెరుగుతోందని అంచనా వేస్తున్నట్లు అధ్యయనం సహ రచయిత సోరీ తెలిపారు. ఈ పొరల నిర్మాణం, సెరెస్ ఒకప్పుడు ఉపరితలం కింద సముద్రం ఉండేదన్న సిద్ధాంతానికి బలం చేకూరుస్తుందన్నారు. ఒకప్పటి సముద్రమే.. ఇప్పుడు ఘనీభవించిందని.. గ్రహచరిత్ర ఆధారాలను భద్రపరిచి ఉండవచ్చని తెలిపారు.
సెరెస్ అధ్యయనం ద్వారా మంచు ఖగోళ వస్తువుల నమూనాలను మెరుగుపరచి, సౌర వ్యవస్థలో సముద్రాలు ఎలా ఏర్పడుతాయి ? ఎలా మనుగడ సాగిస్తాయో పరీక్షించవచ్చని సోరీ చెప్పారు. భవిష్యత్ యాత్రలకు సెరెస్ కీలకమైన గమ్యస్థానమని.. అక్కడికి సులువుగ చేరుకొని ఉపరితలం కింద పొరల అధ్యయనానికి డ్రిల్లింగ్ లేదంటే రాడార్ ప్రయోగాలకు అనువైందని చెప్పారు. ఈ లోతైన పరిశీలనల్లో జీవానికి ముందు దశకు సంబంధించి రసాయన చర్యల ఆనవాళ్లు, సూక్ష్మ జీవుల ఉనికి బయటపడి వచ్చని చెప్పారు. చిన్న, గడ్డకట్టిన ఖగోళ వస్తువులపై జీవం ఉనికి అవకాశాలను అర్థం చేసుకునేందుకు సహాపడుతుందని వివరించారు.