Microsoft Surface Pro 12 | టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ భారత మార్కెట్లో ఓ నూతన సర్ఫేస్ ల్యాప్ టాప్‌ను రిలీజ్ చేసింది. సర్ఫేస్ ప్రొ 12 పేరిట ల్యాప్ టాప్‌ను రిలీజ్ చేశారు. ఇది మైక్రో సాఫ్ట్‌కు చెందిన ఏఐ అసిస్టెంట్ కో పైలట్ ప్లస్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ల్యాప్ టాప్ బరువు కేవలం 680 గ్రాములు మాత్రమే ఉంటుంది. చాలా తేలిగ్గా ఉంటుంది కనుక ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ప్రయాణాల్లో చాలా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ను 2 ఇన్ 1 గా కూడా ఉపయోగించవచ్చు. ల్యాప్ టాప్ నుంచి ట్యాబ్ మోడ్‌లోకి చాలా ఈజీగా మారవచ్చు. ఇందుకు గాను బిల్ట్ ఇన్ కిక్ స్టాండ్, డిటాచబుల్ కీబోర్డ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ల్యాప్ టాప్‌ను ట్యాబ్‌లాగా చాలా సులభంగా వాడుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌కు గాను ఓ సర్ఫేస్ స్లిమ్ పెన్ను సైతం అందిస్తున్నారు. దీన్ని ల్యాప్ టాప్ వెనుక భాగంలో సులభంగా పెట్టుకోవచ్చు. అక్కడే ఆ పెన్ చార్జింగ్ అవుతుంది.
సర్ఫేస్ ప్రొ 12 ల్యాప్ టాప్‌ను 82.9 శాతం రీసైకిల్డ్ మెటీరియల్స్‌తో రూపొందించారు. 100 శాతం రీసైకిల్డ్ కోబాల్ట్‌తో ఈ ల్యాప్ టాప్ బ్యాటరీని రూపొందించారు. అందువల్ల ఈ ల్యాప్ టాప్ పర్యావరణ హితంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ఈ ల్యాప్ టాప్‌లో స్నాప్ డ్రాగన్ ఎక్స్ ప్లస్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇది అద్భుతమైన ఏఐ ప్రదర్శనను అందిస్తుందని మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. ఈ ల్యాప్ టాప్ 16 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్‌ను అందిస్తుంది. ఇందులో 12 ఇంచుల పిక్సెల్ సెన్స్ ఫ్లో టచ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను సైతం కలిగి ఉంది. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్కు 2 యూఎస్బీ టైప్ సి పోర్టులను ఏర్పాటు చేశారు. వీటిని ఎక్స్ టర్నల్ డిస్ప్లే లేదా ఫాస్ట్ చార్జింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు.
ఈ ల్యాప్ టాప్ లో అద్భుతమైన కో పైలట్ ప్లస్ ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. రీకాల్ అనే ఏఐ ఫీచర్ సహాయంతో చాలా వేగంగా యాప్స్, ఇమేజెస్, డాక్యుమెంట్లను యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే పలు ఏఐ మోడల్స్‌ను ఉపయోగించి టెక్ట్స్ లేదా ఇమేజెస్‌ను చాలా సులభంగా గుర్తించవచ్చు. టాస్క్ ఆటోమేషన్ కోసం ప్రత్యేక సదుపాయాలను అందించారు. ఫొటోలను ఎడిట్ చేసుకునేందుకు గాను ప్రత్యేకంగా ఫొటోస్ రిలైట్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ల్యాప్ టాప్‌లో స్నాప్ డ్రాగన్ ఎక్స్ ప్లస్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండగా, 16 జీబీ ర్యామ్ లభిస్తుంది. 256, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లను అందిస్తున్నారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక భాగంలో 10 మెగాపిక్సల్ అల్ట్రా హెచ్డీ కెమెరా ఉంది. ముందు వైపు ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరాను ఇచ్చారు. డాల్బీ అట్మోస్ సదుపాయం ఉంది. కనుక సౌండ్ చాలా క్వాలిటీగా ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్, వైఫై 7, బ్లూటూత్ 5.4 వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రొ 12 ల్యాప్‌టాప్‌కు చెందిన 16 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.90,999 ఉండగా, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.99,999గా ఉంది. ఈ ల్యాప్ టాప్‌ను అక్టోబర్ 6 నుంచి విక్రయించనున్నారు. అమెజాన్‌తోపాటు అన్ని ప్రధాన రిటెయిల్ ఔట్‌లెట్స్‌లో ఈ ల్యాప్ టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్ టాప్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.15,199 విలువైన సర్ఫేస్ ప్రొ 12 కీబోర్డును ఉచితంగా అందించనున్నారు.