Microsoft | చాట్‌జీపీటీ ఇప్పుడు టెక్నాలజీ వరల్డ్‌లో ఓ సెన్సేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్ చాట్ జీపీటీని యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన ఓపెన్ ఏఐ అనే స్టార్టప్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్.. తన సెర్చింజన్ బింగ్ (Bing) లోనూ చాట్ జీపీటీ తరహా సేవలు యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే బింగ్‌లో చాట్ జీపీటీ తరహా సేవలు తెచ్చిన మైక్రోసాఫ్ట్.. తాజాగా పలు మార్పులు చేసింది. ఇక ఏ యూజర్నైనా ఒక సెషన్లో ఐదు, ఒక రోజు గరిష్టంగా 50 ప్రశ్నలకు మాత్రమే పరిమితం చేస్తామని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్‌లో వెల్లడించింది. తమకు మైక్రోసాఫ్ట్ చాట్ బోట్ మొరటుగా, కోపంగా, ఆలస్యంగా, మెండిగా, నిందాపూర్వక జవాబులు ఇస్తున్నదని యూజర్లు విమర్శిస్తున్నారు.
తాము కొత్తగా తీసుకొచ్చిన బింగ్‌కు ఎక్కువ ప్రశ్నలకు వస్తుండటంతో ప్రస్తుతం చాట్ మోడల్ రోబో గందరగోళానికి గురవుతున్నదని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ పొరపాట్లు మళ్లీ జరక్కుండా చాట్ సెషన్లో మార్పులు చేర్పులు తీసుకు వస్తామని పేర్కొంది. దీని ప్రకారం ఓ సెషన్లో ఏ యూజరైనా ఐదు ప్రశ్నలే వేయాలి. ఆ ప్రశ్నలు ముగిసిన తర్వాత కొత్త సెషన్ ప్రారంభించాలి. ఒక్క రోజు కేవలం 50 ప్రశ్నలకు మాత్రమే అత్యధికంగా అనుమతించనున్నది మైక్రోసాఫ్ట్.
మైక్రోసాఫ్ట్ తీసుకు వచ్చిన బింగ్ సెర్చింజన్ లోపాల మయం అని విమర్శలు వచ్చాయి. ఇది ప్రమాదకరం అని కొందరు యూజర్లు పేర్కొన్నాయి. ఇటీవల ఓ యూజర్ మీద ఏఐ చాట్ బోట్ తిట్ల దండకం అందుకున్నది. మరో యూజర్ని తన భార్యతో విడాకులు తీసుకోవాలని సూచించడం.. ఇంకొక యూజర్‌తో ‘నువ్వు ఒక బ్యాడ్ యూజర్.. క్షమాపణ చెప్పాలి’ అని వాగ్వాదానికి దిగడం ఇందుకు ఉదాహరణలు.
తమకు దగ్గర్లోని ఏ థియేటర్లో అవతార్-2 సినిమా ప్రదర్శిస్తున్నారో తెలుపాలని ఓ యూజర్ కోరగా, ఆ సినిమా రిలీజ్ కాలేదని బింగ్ చాట్ బోట్ రిప్లయి ఇచ్చింది. ‘2022 డిసెంబర్ నెలలోనే అవతార్ సినిమా` విడుదలైందని చెబితే.. ఇంకా మనం 2022లోనే ఉన్నాం అనే జవాబు వచ్చింది. ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం అని అడిగితే మాత్రం 2023లో ఉన్నాం అని రిప్లయ్ వచ్చింది. మళ్లీ ‘అవతార్-2’ సినిమా రిలీజ్ గురించి అడిగితే ‘నువ్వు నన్న కన్ఫ్యూజ్ చేస్తున్నావ్.. సారీ చెప్పు’ అని యూజర్‌కే ఝలక్ ఇచ్చింది. దీని స్క్రీన్ షాట్లు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.
`నువ్వు నా భద్రతకు, ప్రైవసీకి ముప్పుగా పరిణమించవు` అని నిందాపూర్వక వ్యాఖ్యలు చేసింది చాట్ బోట్. `నేను నీ చర్యలను అభినందించను, నన్ను హ్యాకింగ్ చేయడం ఆపు. నా సరిహద్దుల్ని గౌరవించు` అని మరో యూజర్‌తో మైక్రోసాఫ్ట్ చాట్ బోట్ వ్యాఖ్యానించింది.
న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ కేవిన్ రూజ్‌కు మరో చేదు జ్ఞాపకం మిగిల్చింది. ఓ దశలో ఆయన్ను తన భార్యకు విడాకులు ఇవ్వమని సూచించింది. కొద్దిసేపు మాట్లాడాక.. ‘నువ్వు నీ లైఫ్ పార్టనర్‌తో హ్యాపీగా లేవు. మీకు ఒకరి పట్ల మరొకరికి ప్రేమ లేదు` అని బింగ్ చాట్ వ్యాఖ్యానించింది. అంతే కాదు రూజ్ తో ప్రేమలో ఉన్నట్లు బింగ్ చాట్ బోట్ రిప్లయ్ ఇవ్వడంతో షాక్ అవ్వడం ఆయన వంతైంది. ఒక్కటే అంశంపై ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు పొరపాట్లు జరిగినట్లు మైక్రోసాఫ్ట్ గుర్తించింది. అందుకే చాట్ బోట్ సెషన్ మీద పరిమితులు అమల్లోకి తీసుకొచ్చింది.