MATTER AERA 5000 Plus | ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. దేశంలో రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఆకాశాన్నంటుతుండడంతో ప్రజలు విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా రోజువారి ప్రయాణం కోసం చాలా మంది ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ రంగంలో అనేక మోటార్ సైకల్స్, స్కూటర్లు వచ్చేశాయి. ఇదే కోవలో తాజాగా మ్యాటర్ మోటార్ వర్క్స్ అనే కంపెనీ కూడా ఓ నూతన మోటార్ సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఏరా 5000 ప్లస్ పేరిట ఈ మోటార్ సైకిల్‌ను చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో లాంచ్ చేశారు. ఈ మోటార్ సైకిల్లో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు.
మ్యాటర్ మోటార్ వర్క్స్‌కు చెందిన ఏరా 5000 ప్లస్ మోటార్ సైకిల్‌ను భారతీయ రోడ్లకు అనుగుణంగా రూపొందించారు. ఇందులో హైపర్ షిఫ్ట్ టెక్నాలజీ ఆధారంగా నడిచే 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల వాహనాన్ని చాలా స్మూత్‌గా నడిపే అవకాశం ఉంటుంది. ఈ మోటార్ సైకిల్లో 3 రకాల రైడ్ మోడ్స్‌ను అందిస్తున్నారు. 5 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌ను ఇచ్చారు. ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఏకంగా 172 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ మోటార్ సైకిల్‌కు ఐపీ 67 డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్‌ను సైతం అందిస్తున్నారు. ఈ బైక్‌కు 7 ఇంచుల స్మార్ట్ టచ్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో బైక్‌కు చెందిన నావిగేషన్ ఫీచర్‌తోపాటు మ్యూజిక్, రైడ్ డేటా వంటి సదుపాయాలను యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఓటీఏ ద్వారా సాఫ్ట్వేర్ అప్డేట్స్ను సైతం పొందవచ్చు.
ఈ బైక్‌కు స్మార్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీనికి ఆన్ బోర్డ్ చార్జర్ లభిస్తుంది. 1 లక్షకు పైగా చార్జింగ్ పాయింట్లను యాక్సెస్ చేయవచ్చు. 2.8 సెకన్ల వ్యవధిలో సుమారుగా గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్‌కు డ్యుయల్ డిస్క్ బ్రేక్‌లను ఇచ్చారు. వీటికి ఏబీఎస్ సదుపాయం కూడా ఉంది. డ్యుయల్ సస్పెన్షన్‌ను ఇచ్చారు. అలాగే పార్కింగ్ అసిస్టెంట్ సదుపాయం కూడా ఉంది. ఈ బైక్‌కు గాను మ్యాటర్ వర్స్ మొబైల్ యాప్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో బైక్‌ను లైవ్‌లో ట్రాక్ చేయవచ్చు. అలాగే రిమోట్ లాక్, అన్‌లాక్ సదుపాయం కూడా ఉంది. రైడ్ హిస్టరీని యాప్ లో యాక్సెస్ చేయవచ్చు. ఈ బైక్‌కు స్మార్ట్ కీ సదుపాయం ఉంది. అందువల్ల బైక్‌ను కీ లేకుండానే స్టార్ట్ చేయవచ్చు. ఈ బైక్‌ను నిర్వహించడం కూడా చాలా తేలికే. ఒక కిలోమీటర్‌కు సుమారుగా 25 పైసల ఖర్చు వస్తుందని కంపెనీ చెబుతోంది. దీని వల్ల 3 ఏళ్లలో సుమారుగా రూ.1 లక్ష వరకు పొదుపు చేయవచ్చని చెబుతున్నారు.
మ్యాటర్ మోటార్ వర్క్స్ ఏరా 5000 ప్లస్ మోటార్ సైకిల్ గంటకు గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. బ్యాటరీ ఫుల్ చార్జింగ్ చేస్తే సుమారుగా 172 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. సిటీ రోడ్లపై ట్రాఫిక్‌లో అయితే సుమారుగా 125 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్ అనే రైడ్ మోడ్స్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ బైక్‌లో అందించే బ్యాటరీకి లైఫ్ టైమ్ వారంటీ సదుపాయం కూడా ఉంది. ఈ బైక్‌కు గాను ట్యూబ్‌లెస్ టైర్లను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ బైక్ పనిచేస్తుంది. 3జీబీ ర్యామ్, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ బైక్‌కు 3 ఏళ్ల వరకు వారంటీ లభిస్తుంది. ఈ బైక్‌ను కాస్మిక్ బ్లాక్, కాస్మిక్ బ్లూ, గ్లేసియర్ వైట్, బ్లేజ్ రెడ్, నోర్డ్ గ్రే కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ బైక్‌కు చెందిన ఎక్స్-షోరూం ధర రూ.1,93,826 గా ఉంది. దీన్ని చెన్నైలో ఉన్న ఈ కంపెనీ షోరూంలో కొనుగోలు చేయవచ్చు. లేదా ఈ కంపెనీకి చెందిన అధికారిక వెబ్సైట్లోనూ ఆర్డర్ చేయవచ్చు.