Lava Blaze Dragon 5G | బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను అందించడంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో ఈ తరహా ఫోన్లను అనేకం రిలీజ్ చేశారు. ఇదే కోవలో లావా మొబైల్స్ కూడా ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. లావా బ్లేజ్ డ్రాగన్ 5జి పేరిట ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్లో 6.75 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ లభిస్తుంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా ఇస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు.
ఇందులో 4జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 4జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే సదుపాయం కల్పించారు. ఈ ఫోన్లో క్లీన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఎలాంటి బ్లోట్‌వేర్ లేదని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్ కు ఒక ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్ను, 2 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌ను సింగిల్ వేరియెంట్లో 128జీబీ స్టోరేజ్‌లో లాంచ్ చేశారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. 3.5ఎంఎం ఆడియో జాక్ లభిస్తుంది. ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. 5జి సేవలను పొందవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా ఉంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.
లావా బ్లేజ్ డ్రాగన్ 5జి స్మార్ట్ ఫోన్‌ను గోల్డెన్ మిస్ట్, మిడ్నైట్ మిస్ట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో ఆగస్టు 1 నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ సదుపాయం లభిస్తుందని కంపెనీ చెబుతోంది. లాంచింగ్ సందర్భంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.1000 అదనపు డిస్కౌంట్ ఇస్తారు.