Itel A95 5G | ప్రస్తుతం చాలా మంది బడ్జెట్ ధర కలిగిన స్మార్ట్ ఫోన్లను వాడేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ధర ఎక్కువ పెట్టి కొన్న ఫోన్లను ఎక్కువ రోజుల పాటు ఉపయోగించడం లేదు. అందుకనే బడ్జెట్ ధర కలిగిన ఫోన్లకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ ఫోన్లలోనూ ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. కనుక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిందనే చెప్పవచ్చు. ఈ ఫోన్లతో అన్ని వర్గాల కస్టమర్లకు చేరువ కావచ్చనే ఉద్దేశంతో కంపెనీలు కూడా ఎక్కువగా బడ్జెట్ ఫోన్లను తయారు చేసేందుకే ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అందులో భాగంగానే లేటెస్ట్ గా ఐటెల్ కూడా ఓ నూతన బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఐటెల్ ఎ95 5జి పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
ఐలెట్ ఎ95 5జి స్మార్ట్ ఫోన్ ఈ కంపెనీకి చెందిన లేటెస్ట్ 5జి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో ఐటెల్ ఎ80 ఫోన్‌ను లాంచ్ చేసింది. దానికి మరిన్ని మెరుగులు దిద్ది తాజాగా ఎ95 5జి ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్లో 6.67 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. ఎల్సీడీ డిస్ప్లే కావడం అలాగే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉండడంతో ఈ డిస్ప్లేపై నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్‌కు చెందిన డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 6జీబీ ర్యామ్ లభిస్తుంది. దీన్ని మరో 6జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకోవచ్చు. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో డెప్త్ సెన్సార్‌ను కూడా ఇచ్చారు. ఇక ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు ఐపీ54 రేటింగ్ కూడా ఉంది. ఇది డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఈ ఫోన్లో ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉంది. అందువల్ల ఈ ఫోన్‌ను రిమోట్‌గా కూడా ఉపయోగించవచ్చు. 4జీబీ, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల సిమ్ వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఐటెల్ ఓఎస్ 14 ఈ ఫోన్లో లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. ఈ ఫోన్లో 5జి ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా ఉంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై ని ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.
ఐటెల్ ఎ95 5జి స్మార్ట్ ఫోన్ బ్లాక్, గోల్డ్, మింట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,599 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్‌ను ప్రస్తుతం కేవలం ఆఫ్ లైన్ స్టోర్స్‌లోనే విక్రయిస్తున్నారు. త్వరలోనే ఆన్లైన్ విక్రయాలను కూడా ప్రారంభించనున్నారు. ఈ ఫోన్‌ను కొన్న వారికి లాంచింగ్ ఆఫర్ కింద 100 రోజుల వాలిడిటీ కలిగిన ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్‌ను అందిస్తున్నారు. బడ్జెట్ ధరలోనే మంచి ఫీచర్లు కలిగిన 5జి ఫోన్‌ను కొనాలని చూస్తున్నవారికి ఈ ఫోన మంచి ఎంపిక అని చెప్పవచ్చు.