iPhone SE (2022) | మీకు ఐఫోన్ 6 ఫోన్ గుర్తుందా? 2014లో రిలీజ్ అయిన ఐఫోన్ 6 చూడటానికి ఎలా ఉంటుందో.. ఇటీవల రిలీజ్ అయిన ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్ కూడా అలాగే ఉంటుంది. ఈ ఫోన్ ధర భారత్‌లో రూ.43,900గా ఉంది. నిజానికి.. ఈ ఫోన్‌ను రూ.30 వేల కంటే తక్కువ ధరకే అందిస్తారని అంతా భావించారు. ఐఫోన్ చరిత్రలోనే ఇది అత్యంత చవకైన ఫోన్ అంటూ టెక్ నిపుణులు కూడా దీనిపై విశ్లేషించినప్పటికీ.. ఈ ఫోన్ ధరను ఏకంగా రూ.43,900గా నిర్ణయించింది యాపిల్ సంస్థ.
నిజానికి.. ఇదే 40 వేల రేంజ్లో బెస్ట్ ఫీచర్లతో వేరే బ్రాండ్స్ నుంచి చాలా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ, వన్‌ప్లస్ 9ఆర్టీ 5జీ, వివో వీ23 ప్రో 5జీ, ఒప్పో రెనో 7 ప్రో 5జీతో పాటు యాపిల్ ఐఫోన్ 11 ఫోన్ ధర కూడా 40 వేల రేంజ్‌లోనే ఉండటంతో ప్రత్యేకంగా ఐఫోన్ ఎస్ఈ 2022నే తీసుకోవాలంటే.. ఖచ్చితంగా ఈ ఫోన్లో ప్రత్యేకమైన ఫీచర్లు ఉండాలి.
అయితే.. ధరకు తగ్గట్టుగానే ఈ ఫోన్లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏ 15 బయోనిక్ ప్రాసెసర్.
అత్యాధునికమైన కెమెరా, ముందు భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ దీని సొంతం. ఈ ఫోన్ చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ ఇది హైక్వాలిటీ ఫోన్. అలాగే 5జీ నెట్‌వర్క్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఐఫోన్ 13లో ఉండే ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌నే ఐఫోన్ ఎస్ఈలోనూ వాడుతున్నారు.
2020లో వచ్చిన ఐఫోన్ ఎస్ఈతో పోల్చితే ఈ ఫోన్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. 12 ఎంపీ రేర్ కెమెరా, 7 ఎంపీ ఫ్రంట్ కెమెరా, పోర్టేట్ లైటింగ్, ఆప్టికల్ స్టబిలైజేషన్, 4కే 60 ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ లాంటి ఫీచర్లు ఐఫోన్ ఎస్ఈ 2022 సొంతం.
ఐఫోన్ 13లో ఉన్న ఫోటోగ్రఫిక్ స్టయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఐఫోన్ 13 పర్ఫార్మెన్స్కు ఏమాత్రం తగ్గకుండా ఈ ఫోన్‌ను యాపిల్ లాంచ్ చేసింది.