తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను తయారు చేసి ఇవ్వడంలో కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా కొన్ని కంపెనీలు అయితే మిడ్ రేంజ్ ఫోన్లలో ఉండే ఫీచర్లను బడ్జెట్ ఫోన్లలోనే అందిస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఐక్యూ కూడా ఒకటి. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు నూతన ఫోన్లను అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే లేటెస్ట్గా జడ్ సిరీస్‌లో జడ్10 పేరిట ఓ ఫోన్‌ను లాంచ్ చేయగా, ఇందులో ఉన్న ఫీచర్లను కాస్త కుదించి బడ్జెట్ ధరలోనే మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను ఐక్యూ లాంచ్ చేసింది. ఐక్యూ జడ్10ఎక్స్ 5జి పేరిట ఓ నూతన బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను ఐక్యూ లాంచ్ చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
ఐక్యూ జడ్10ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్లో 6.72 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఈ ఫోన్ స్క్రీన్ కలిగి ఉంది. అందువల్ల ఫోన్ డిస్ప్లేపై నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్‌కు ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న పంచ్ హోల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ ఆక్టాకోర్ 7300 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫన్ టచ్ ఓఎస్ 15ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు 2 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నట్లు కంపెనీ తెలియజేసింది.
ఈ ఫోన్లో ఉన్న బ్యాటరీకి 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ చాలా వేగంగా చార్జింగ్ అవుతుంది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను సైతం కలిగి ఉంది. కనుక కింద పడినా కూడా అంత సులభంగా పగలదు. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ అయింది. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. కానీ మెమొరీ కార్డు సదుపాయం లేదు. ఈ ఫోన్ లో ఉన్న వెనుక కెమెరాలతో 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఇందులో ఇన్ ఫ్రారెడ్ సెన్సార్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్ యూఎస్బీ టైప్ సి ఆడియోను సపోర్ట్ చేస్తుంది. ఐపీ 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 5జి ని ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్లో పొందవచ్చు. ఐక్యూ జడ్10ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ అల్ట్రా మెరీన్, టైటానియం కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,499 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,499గా ఉంది. అమెజాన్‌తోపాటు ఐక్యూ ఇండియా ఇ-స్టోర్‌లో ఈ ఫోన్‌ను ఏప్రిల్ 22 నుంచి విక్రయించనున్నారు. పలు ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.1000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.