Instagram Plus : ఇండియాలో ఎక్కువగా వాడుతున్న సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్. పిల్లలు, యూత్, పెద్దవారు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాడుతూ మరిన్ని మంచి ఫీచర్స్ కోరుకునే వారి కోసం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్లస్ ఫీచర్ వచ్చింది. ఇన్‌స్టా మాతృ సంస్థ మెటా తాజాగా ఇండియాలో ఈ సర్వీస్‌ను లాంఛ్ చేసింది. ఇది పెయిడ్ సర్వీస్. ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇన్స్టాగ్రామ్ ప్లస్‌లోకి మారాలంటే నెలకు రూ.99తో సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలి.
అయితే, ఇప్పుడే ఈ ఫీచర్ లాంఛ్ అయింది కాబట్టి.. లాంఛింగ్ ఆఫర్ కింద మొదటి ఆరు నెలల వరకు 50 శాతం డిస్కౌంట్‌తో నెలకు రూ.49తోనే ఇన్స్టాగ్రామ్ ప్లస్‌కు సబ్‌స్ర్కైబ్ చేసుకోవచ్చు. దీని ద్వారా యూజర్లకు కొన్ని కొత్త ఫీచర్లు వస్తాయి. అలాగే, దీనికి సబ్‌స్ర్కైబ్ చేసుకోని వారికి వచ్చిన ఇబ్బందేం లేదు. ఇప్పటివరకు ఉన్న ఫీచర్లన్నీ వారికి కంటిన్యూ అవుతాయి. అదనపు ఫీచర్లు కావాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ప్లస్‌కు మారాల్సిందే. అడిషనల్ టూల్స్, కంట్రోల్స్, పర్సనలైజ్డ్ ఫీచర్స్ కావాలని కోరుకునేవారికి ఇది బెస్ట్. దీనివల్ల లభించే ఫీచర్లివి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ 24 గంటలు మాత్రమే ఉంటున్నాయి.
కానీ, ప్లస్ మెంబర్షిప్ తీసుకుంటే అవి 48 గంటల వరకు ఉంటాయి. ఇందులో స్టోరీ స్పాట్లైట్ సర్వీస్ కూడా ఉంటుంది. అంటే, వారంలో ఒక స్టోరీని ఫాలోవర్లకు ఎక్కువ విజిబిలిటీ ఉండేలా చేస్తుంది. క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్స్ మాత్రమే కాకుండా కస్టమ్ స్టోరీ ఆడియెన్స్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. స్టోరీ ప్రివ్యూ ఆప్షన్ కూడా ఉంది. అలాగే, యూజర్లు పూర్తి స్టోరీ చూడకుండా ప్రివ్యూ చూసి వదిలేసే ఛాన్స్ కూడా ఉంటుంది. స్టోరీ అనలిటిక్స్ అనే మరో ఫీచర్ కూడా ఉంది. అంటే.. ఒక స్టోరీని ప్రత్యేకంగా ఒక యూజర్ చూశాడో లేదో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే, ఎన్నిసార్లు స్టోరీ చూశారో కూడా తెలుసుకునే వీలుంది. స్టోరీలకు యానిమేటెడ్ రియాక్షన్స్ ఇచ్చేలా సూపర్ హార్ట్స్ ఫీచర్ కూడా యాడ్ కానుంది.
అలాగే, యూజర్లకు తెలియకుండా వారి స్టోరీని చూడొచ్చు. దీన్ని ఘోష్ట్ మోడ్ ఫీచర్ అంటారు. దీనివల్ల ఆ యూజర్ స్టోరీ వ్యూ లిస్టులో వీరి పేరు కనిపించదు. ప్రొఫైల్ బయోస్కు ప్రత్యేక ఫాంట్లు వాడొచ్చు. ఒకటికంటే ఎక్కువ ప్రొఫైల్స్ పిన్ చేసుకోవచ్చు. ఇలాంటి అనేక ఫీచర్లు ఇన్స్టాగ్రామ్ ప్లస్ ద్వారా లభిస్తాయి.