చెన్నై : ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT ) టెక్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో చాట్‌జీపీటీ లాంఛ్ కాగా రోజురోజుకూ దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. వివిధ ప్రశ్నలకు, సమస్యలకు ఏఐ చాట్‌బాట్ చిటికెలో పరిష్కారాలను, సమాధానాలను ఇస్తూ యూజర్ల నుంచి మంచి స్పందనను రాబడుతోంది. క్లిష్టమైన కోడింగ్ నుంచి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, వ్యాసాలు, కవితలు రాయడం వరకూ ఏఐ చాట్‌జీపీటీ యూజర్లకు పలు రకాలుగా సాయపడుతోంది.
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ చాట్‌జీపీటీ స్పందిస్తుండగా, ప్రాంతీయ భాషలపై అంతగా పట్టు లేదని వెల్లడవుతోంది. ప్రాంతీయ భాషలను తాను సరిగ్గా అవగతం చేసుకోలేకపోతున్నానని కన్నడ భాష గురించి ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఏఐ టూల్ బదులిచ్చింది. ప్రాంతీయ భాషలపై ప్రధానంగా దృష్టిసారిస్తూ చాట్‌జీపీటీకి ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసేందుకు ఐఐటీ మద్రాస్ కసరత్తు సాగిస్తోంది. ఈ దిశగా త్వరలో తమ సంస్ధ సన్నాహాలు చేపడతుందని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ. కామకోటి తెలిపారు.
అయితే ఏయే ప్రాంతీయ భాషలపై పట్టు ఉండేలా ఏఐ టూల్‌ను డెవలప్ చేస్తారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రభుత్వం ఈలెర్నింగ్ కోసం చేపట్టిన స్వయం ప్లాట్‌ఫాం ద్వారా సమకూరిన డేటా ద్వారా మ్యాథ్స్ చాట్, ఫిజిక్స్ చాట్ వంటి చాట్ ఇంజనీరింగ్ వేదికల ఏర్పాటు సాధ్యమేనని కామకోటి చెప్పుకొచ్చారు. ఇక చాట్‌జీపీటీ ప్రస్తుతం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉండటంతో ట్రాన్స్లేషన్ కూడా ప్రత్యామ్నాయంగా ముందుకొస్తోంది. బహుభాషా వేదికగా ఏఐ టూల్‌ను తాము తీసుకువస్తే చాట్‌జీపీటీ కంటే అది పెద్దవిషయం అవుతుందని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ పేర్కొన్నారు. తాము కచ్చితంగా ఈ దిశగా ఇప్పటికిప్పడు కాకున్నా రాబోయే రోజుల్లో సన్నాహాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
Read More :