HMD T21 | ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు దీటుగా చాలా మంది వినియోగదారులు ట్యాబ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ట్యాబ్‌ల సహాయంతో చదువు, ఉద్యోగం వంటి పనులు చక్కబెట్టకుంటున్నారు. దీంతో కంపెనీలు కూడా ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన ట్యాబ్‌లను బడ్జెట్ ధరలోనే అందిస్తున్నాయి. అందులో భాగంగానే హెచ్ఎండీ గ్లోబల్ కూడా ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. హెచ్ఎండీ టీ21 పేరిట ఈ ట్యాబ్‌ను లేటెస్ట్గా లాంచ్ చేశారు. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ట్యాబ్‌లో 10.36 ఇంచుల 2కె ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో యూనిసోక్ టి612 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. 4జీకి ఇందులో సపోర్ట్ లభిస్తుంది. వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్లను సైతం పంపుకోవచ్చు.
ఈ ట్యాబ్‌లో ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, వెనుక వైపు సైతం 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఐపీ 52 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఈ ట్యాబ్‌కు అందిస్తున్నారు. ఇందులో 8200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ట్యాబ్ డిస్ప్లేకు గాను టఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ లో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేశారు. 512జీబీ వరకు ఇందులో స్టోరేజ్‌ను మొమొరీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ లభిస్తుంది. దీన్ని త్వరలో రిలీజ్ చేస్తారు.
ఈ ట్యాబ్‌కు 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. ఎఫ్ఎం రేడియోను అందిస్తున్నారు. 4జి ఎల్టీఈ సేవలను పొందవచ్చు. డ్యుయల్ బ్యాండ్ వైఫై కూడా ఉంది. బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
హెచ్ఎండీ టి21 ట్యాబ్ బ్లాక్ స్టీల్ కలర్ ఆప్షన్లో లాంచ్ అయింది. ఈ ట్యాబ్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999 ఉండగా, లాంచింగ్ ఆఫర్ కింద రూ.14,499 ధరకే దీన్ని అందిస్తున్నారు. హెచ్ఎండీ ఆన్లైన్ స్టోర్‌లో ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేసిన వారికి 2 నెలల పాటు ఉచిత క్లౌడ్ గేమింగ్ సబ్ స్క్రిప్షన్ను అందిస్తారు. ఇందులో 500కు పైగా గేమ్స్‌ను 2 నెలల పాటు ఉచితంగా ఆడుకోవచ్చు. ఈ ట్యాబ్ ఉద్యోగులకే కాకుండా, విద్యార్థులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.