Space Baby | అంతరిక్షం ఎన్నో అద్భుతాలకు ఆలవాలంగా తయారైంది. జంతువులు మొదలు మనిషి వరకు అంతరిక్షంలో వెళ్లగలిగారు. అక్కడి వాతావరణం గురించి పరిశోధనలు ఎన్నో చేస్తున్నారు. జంతువులు, మొక్కల జీవనానికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. మనిషి తొలిసారిగా 1961 లో అంతరిక్షంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి అంతరిక్షంలో పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉన్నదా అన్న ప్రశ్న అందరి మదిలో మెదులుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు 62 ఏండ్ల తర్వాత కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. అయితే, బ్రిటన్, నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు త్వరలో సమాధానం ఇవ్వవచ్చు.
iNews నివేదిక ప్రకారం, బ్రిటీష్ శాస్త్రవేత్తలు డచ్ కంపెనీ స్పేస్బార్న్ యునైటెడ్ సహకారంతో అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ ఇన్ స్పేస్ (ఆర్ట్స్-ARTS) మాడ్యూల్‌ను తయారు చేస్తున్నారు. ఈ మాడ్యూల్ ద్వారా బయో శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మాడ్యూల్ లోపల ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) చికిత్స ద్వారా పిండం తయారవుతుంది. అనంతరం దానిని భూమిపైకి తీసుకువచ్చి స్త్రీ గర్భంలోకి మారుస్తారు. భూమిపై పురుడుపోసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా పుట్టిన ఈ పిల్లలను ‘స్పేస్ బేబీస్’ అని పిలుస్తారు.
ముందుగా ఎలుకలపై ప్రయోగాలు చేయనున్నారు. ఎలుకల శుక్రకణాలు, గుడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి ఫలదీకరణ చేస్తారు. మాడ్యూల్ సాంకేతికతను పరీక్షించే తొలి ఫ్లైట్ ఏప్రిల్‌లో కెనడా నుంచి బయలుదేరనున్నది. 18 – 24 నెలల్లో ఐవీఎఫ్ పని చేపట్టే బయో ఉపగ్రహం సిద్ధంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. స్పేస్బోర్న్ సంస్థకు అస్గార్డియా కంపెనీ మద్దతు ఉన్నది. అంతరిక్షంలో ప్రపంచంలోనే తొలి మానవ నివాసాన్ని ఏర్పాటు చేయడం 2016 లో ఏర్పాటైన ఈ కంపెనీ ఉద్దేశంగా పెట్టుకున్నది. ఈ కాలనీ కోసం ఇప్పటికే 10 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని కంపెనీ పేర్కొంటున్నది.
ఈ ప్రాజెక్ట్ అంతిమ లక్ష్యం భూమి వెలుపల సహజంగా మనుషులను ఉత్పత్తి చేయడమని స్పేస్బోర్న్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎగ్బర్ట్ అడెల్బ్రూక్ చెప్పారు. అయితే, దీనికన్నా ముందు మనకు అంతరిక్షంలో ఉన్న టెక్నాలజీని పరీక్షించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. దాని తర్వాత మాత్రమే సెక్స్, ప్రెగ్నెన్సీ, అంతరిక్షంలో పిండం తయారీ, డెలివరీపై దృష్టి కేంద్రీకరిస్తామని వెల్లడించారు. రానున్న 5 ఏండ్లలో మానవ కణాలతో బయో-ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపవచ్చని డాక్టర్ అడెల్బ్రూక్ చెప్పారు. అంతరిక్షంలో తొలి మానవ బిడ్డకు ప్రసవం 2031 నాటికి జరుగుతుందని అంటున్నారాయన. ప్రస్తుతం ఇది భూమి దిగువ కక్ష్యలో మాత్రమే సాధ్యమవుతుందని చెప్తున్నారు.