మెటావర్స్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఎప్పుడైతే ఫేస్బుక్ తన కంపెనీ పేరును మెటాగా మార్చిందో.. మెటావర్స్ మీద ఇక నుంచి తాము పని చేయబోతున్నట్టు మార్క్ జుకర్‌బర్గ్ ఎప్పుడైతే ప్రకటించాడో.. అప్పటి నుంచి మెటావర్స్ గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది.
మెటావర్స్ అంటే అదో వర్చువల్ ప్రపంచం. ప్రస్తుతం ఫిజికల్‌గా మనం చూస్తున్న ప్రపంచం వేరు.. మెటావర్స్‌లో ప్రపంచం వేరు. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం మనం. ఇంకొన్ని రోజుల్లో మెటావర్స్ ప్రపంచంలోకి అడుగుబెట్టబోతున్నాం.
మెటావర్స్ అనే వర్చువల్ రియాల్టీని ఫేస్‌బుక్‌తో పాటు చాలా కంపెనీలు డెవలప్ చేస్తున్నాయి. ఇప్పటికే మెటావర్స్‌లో రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ అయింది. మెటావర్స్‌లో వర్చువల్ స్పేస్ తీసుకొని కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసుకుంటున్నాయి. సేల్స్ స్టార్ట్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు మెటావర్స్‌లో పలు ఎంటర్టైన్మెంట్ షోలు, గేమ్స్ ప్లాన్ చేస్తున్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల మెటావర్స్‌లో ఓ జంట పెళ్లి చేసుకుంది. ఇండియాలో జరిగిన తొలి మెటావర్స్ మ్యారేజ్ అది. వాళ్ల పెళ్లిని ఎన్ఎఫ్టీగా క్రియేట్ చేసి కొత్త పెళ్లి జంట అవతార్‌ను బియాండ్‌లైఫ్ డాట్ క్లబ్ అనే ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్‌లో సేల్కు పెట్టారు.
కాయిన్‌స్విచ్ కుబేర్ ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన ఆ జంట 12 పీస్ ఎన్ఎఫ్టీ కలెక్షన్‌ను సేల్‌లో ఉంచారు. హారీ పోటర్ థీమ్ బ్యాక్ డ్రాప్‌తో పెళ్లి జంట పక్కన పెళ్లి కూతురు చనిపోయిన తండ్రి అవతార్ కూడా ఉంటుంది. దానితో పాటు పెళ్లి ఆహ్వాన పత్రికను కూడా ఎన్ఎఫ్టీలో జతపరిచారు.
గత నెలలో పంజాబ్‌కు చెందిన సింగర్ డలేర్ మెహందీ మెటావర్స్‌లో కన్సర్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇలా మెటావర్స్‌లో కన్సర్ట్ నిర్వహించడం భారత్‌లో ఇదే తొలిసారి.