Elon Musk on Twitter |ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకోవడమే ఆలస్యం.. దాంట్లో పలు మార్పులూ చేర్పులూ తీసుకొస్తున్నారు దాని కొత్త అధినేత ఎలన్‌మస్క్. సీఈవోగా పని చేసిన పరాగ్ అగర్వాల్‌తోపాటు ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సాగనంపిన మస్క్.. సంస్థలో కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘విభిన్న, విస్తృత దృక్కోణాల్లో ఓ కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. ఆ కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు ట్విట్టర్లో కంటెంట్ నియంత్రణపై ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోరు. రద్దయిన, మూసేసిన ట్విట్టర్ అకౌంట్ల పునరుద్ధరణ వంటి చర్యలు ఉండవు’ అని స్వయంగా ఎలన్‌మస్క్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ట్విట్టర్లో కంటెంట్ నియంత్రణ విధానాల్లో ఏ మార్పులు చేయడం లేదని ఎలన్‌మస్క్ తెలిపారు. తాము ఏర్పాటు చేయబోయే కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్ పని తీరెలా ఉంటుందో వెల్లడించలేదు.
ట్విట్టర్లో కంటెంట్ నియంత్రణ విధానాలను సరళతరం చేస్తామని ఇంతకుముందే ఎలన్‌మస్క్ హామీ ఇచ్చారు. ట్విట్టర్ అల్గారిథమ్ మరింత పారదర్శకంగా పని చేసేలా చూస్తామన్నారు. ఈ నేపథ్యంలో మస్క్ కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
To be super clear, we have not yet made any changes to Twitter’s content moderation policies https://t.co/k4guTsXOIu
— Elon Musk (@elonmusk) October 29, 2022