Cisco Layoffs | ఆర్థిక మాంద్యం ముంచుకువస్తుందన్న భయాల మధ్య టెక్నాలజీ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఆ జాబితాలో సిస్కో సిస్టమ్స్ కూడా చేరుతున్నది. దాదాపు 4,000 మంది (5 శాతం) సిబ్బందిని సిస్కో తొలగించనున్నదని గత నెలలో వార్తలొచ్చాయి. కొన్ని రకాల బిజినెస్లను పునర్వ్యవస్థీకరించడానికే ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు సిస్కో చెప్పిందని సిలికాన్ వ్యాలీ బిజినెస్ జర్నల్ ఓ వార్తా కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే, ఉద్వాసన జాబితాలో ఉన్న సిస్కో ఉద్యోగులు కొత్త కొలువుల కోసం పాటించాల్సిన టిప్స్ గురించి చర్చించుకున్నారని ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ బ్లైండ్, ది లేఆఫ్.కామ్ వార్తాకథనాలు ప్రచురించాయి.
ఎంత మందిని తొలగిస్తారన్న వివరాలను సిస్కో చైర్మన్ కం సీఈవో చుక్ రాబిన్స్ వెల్లడించడానికి నిరాకరించారు. అయితే, ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగుల జాబితాను సిస్కో నోటిఫై చేసిందని ఆయా వెబ్ సైట్ల వార్తా కథనాల సారాంశం.
ఫేస్ బుక్ పేరెంట్ సంస్థ మెటా, అమెజాన్, ట్విట్టర్, లెనోవో, సేల్స్ ఫోర్స్, అడోబ్ తదితర టెక్ దిగ్గజ సంస్థలు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనాలు వెలువడ్డాయి.