ASUS Vivobook S 16 | ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా యథావిధిగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అవుతుండడంతో టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులను విద్యార్థులకు విక్రయించేందుకు పోటీ పడుతున్నాయి. అలాగే క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని కూడా పలు నూతన ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే అసుస్ కూడా పలు నూతన ల్యాప్‌టాప్ లను భారత్‌లో లాంచ్ చేసింది. వివోబుక్ ఎస్16, ఎస్16 ఓలెడ్, ఎస్14 సిరీస్‌లో ఈ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేశారు. ఈ ల్యాప్‌టాప్‌లలో ఆకట్టుకునే ఫీచర్లను అందించడమే కాదు, ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. వివోబుక్ ఎస్14, వివోబుక్ ఎస్16 ఓలెడ్, వివోబుక్ ఎస్16 మోడల్స్‌లో ఈ నూతన ల్యాప్‌టాప్ లను లాంచ్ చేశారు.
ఈ మూడు మోడల్ ల్యాప్ టాప్లలోనూ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ 2024 (లైఫ్ టైమ్ యాక్సెస్)ను అందిస్తున్నట్లు అసుస్ తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365కు చెందిన 100 జీబీ బేసిక్ వన్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందించనున్నట్లు కూడా తెలిపారు. ఇది స్టూడెంట్లతోపాటు ప్రొఫెషనల్స్, క్రియేటర్లకు ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఇక వివోబుక్ ఎస్14 ల్యాప్‌టాప్‌లో స్నాప్ డ్రాగన్ ఎక్స్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 14 ఇంచుల డిస్ప్లే, విండోస్ 11 హోమ్, ఎంఎస్ ఆఫీస్ హోమ్ 2024 (లైఫ్ టైమ్), ఎం365 బేసిక్ (1 ఏడాది), 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ, వైఫై 6ఇ, అసుస్ ఏఐ కెమెరా, 70 వాట్ అవర్ బ్యాటరీ, యూఎస్బీ టైప్ సి చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
వివోబుక్ ఎస్16 ఓలెడ్ ల్యాప్ టాప్ లో ఇంటెల్ కోర్ ఐ7 13620హెచ్ డెకాకోర్ ప్రాసెసర్, ఇంటెల్ అల్ట్రాహెచ్‌డీ గ్రాఫిక్స్, 16 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, విండోస్ 11 హోమ్, ఎంఎస్ ఆఫీస్ హోమ్ 2024 (లైఫ్ టైమ్), ఎం365 బేసిక్ (1 ఏడాది), 16జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ, వైఫై 6, విండోస్ హలో సపోర్ట్, డాల్బీ అట్మోస్, 70 వాట్ అవర్ బ్యాటరీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే వివోబుక్ ఎస్16 ల్యాప్‌టాప్‌లోనూ దాదాపుగా ఇంచు మించు ఇలాంటి ఫీచర్లనే అందిస్తున్నారు. ఇక ఈ ల్యాప్‌టాప్‌లకు చెందిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
అసుస్ వివోబుక్ ఎస్14 (S3407QA) మోడల్ ధర రూ.74,990 ఉండగా దీన్ని అసుస్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నారు. వివోబుక్ ఎస్14 (S3407QA) మోడల్ ల్యాప్ టాప్ ధర రూ.80,990 ఉండగా ఈ ల్యాప్‌టాప్‌ను అన్ని ప్రధాన రిటెయిల్ స్టోర్స్‌తోపాటు అసుస్ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో విక్రయిస్తున్నారు. వివోబుక్ ఎస్16 ఓలెడ్ ల్యాప్ టాప్ ధర రూ.82,990 ఉండగా ప్రత్యేకంగా ఈ ల్యాప్ టాప్‌ను అసుస్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. అలాగే అసుస్ వివోబుక్ ఎస్16 ల్యాప్‌టాప్‌ను రూ.69,990 ధరకు అసుస్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. పలు బ్యాంకులకు చెందిన కార్డులపై ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ఈ ల్యాప్‌టాప్‌లపై అందజేస్తున్నారు.