Asus Vivobook 14 | ప్రస్తుత తరుణంలో చాలా మంది ఏఐ ఫీచర్లను వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంలో ఫోన్లు, కంప్యూటర్లలో ఏఐ ఫీచర్లను అందించేందుకు తయారీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా ల్యాప్ టాప్లలోనూ ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. ఇదే కోవలో తాజాగా అసుస్ కూడా ఓ నూతన ల్యాప్ టాప్‌ను లాంచ్ చేసింది. వివోబుక్ 14 పేరిట ఓ నూతన ఏఐ ల్యాప్‌టాప్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ చాలా తక్కువ బరువును కలిగి ఉంటుంది. కేవలం 1.49 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. 1.79 సెంటీమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల చాలా స్లిమ్‌గా ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. ఈ ల్యాప్ టాప్‌ను మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో రూపొందించడం విశేషం.
ఈ ల్యాప్ టాప్‌లో 14 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. ఈ డిస్ప్లేను 180 డిగ్రీల కోణంలో అమర్చుకునేలా ప్రత్యేకమైన హింజ్లను ఏర్పాటు చేశారు. ఇందులో స్నాప్ డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఏఐ ఆధారిత టాస్క్‌లను సులభంగా పూర్తి చేసే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఇందులో 8జీబీ ర్యామ్ ను అందిస్తున్నారు. 512జీబీ స్టోరేజ్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఏకంగా 29 గంటల పాటు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ల్యాప్‌టాప్‌కు ఫుల్ హెచ్డీ ఐఆర్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి విండోస్ హలో లాగిన్ ఫీచర్ లభిస్తుంది. అందువల్ల ల్యాప్‌టాప్ పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఇతరులు ఎవరూ ఓపెన్ చేయలేరు.
ఈ ల్యాప్‌టాప్‌కు హెచ్డీఎంఐ 2.1 పోర్టును ఏర్పాటు చేశారు. డ్యుయల్ యూఎస్బీ 4.0 టైప్ సి పోర్టులు కూడా ఉన్నాయి. బ్యాక్ లైట్ కీబోర్డు లభిస్తుంది. గెస్చర్ సపోర్ట్ కలిగిన టచ్ ప్యాడ్‌ను ఇచ్చారు. ఈ ల్యాప్‌టాప్‌లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఏఐ ఫీచర్లను వాడుకునేందుకు గాను ప్రత్యేకంగా కో పైలట్ కీ ని సైతం ఏర్పాటు చేశారు. యూజర్లకు 16జీబీ ర్యామ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. వైఫై 6ఇ, బ్లూటూత్ 5.3 ఫీచర్లు లభిస్తున్నాయి. డాల్బీ అట్మోస్ ఫీచర్ సైతం ఉంది. 50 వాట్ అవర్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ లభిస్తుంది.
అసుస్ వివోబుక్ 14 (ఎక్స్1407క్యూఏ) ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.65,990 ఉండగా దీన్ని ఫ్లిప్‌కార్ట్‌తోపాటు అసుస్ ఇ-స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ను క్వైట్ బ్లూ, కూల్ పసిల్వర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అసుస్ ఇండియా కన్జ్యూమర్ అండ్ గేమింగ్ పీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్ సు మాట్లాడుతూ ఈ ల్యాప్‌టాప్ రోజువారి అవసరాలకు సరిగ్గా పనిచేస్తుందని తెలిపారు. స్టూడెంట్స్, క్రియేటర్లకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఏఐ ఫీచర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాప్‌టాప్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు.