Asus Laptops | తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఏఐ ఫీచర్లు కలిగిన విండోస్ ల్యాప్‌టాప్‌ను కొనాలని చూస్తున్నారా..? అయితే అసుస్ కంపెనీ మీ కోసమే పలు నూతన ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. వివోబుక్ ఎస్14, 14, వివోబుక్ 15 సిరీస్‌లో ఈ ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ ల్యాప్‌టాప్‌లు అన్నింటిలోనూ ఏఐ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే అద్భుతమైన ప్రదర్శనను కూడా అందిస్తాయి. ఉద్యోగులు లేదా విద్యార్థులకు, రోజువారి పనులు నిర్వహించుకునేందుకు ఈ ల్యాప్‌టాప్‌లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. వివోబుక్ ఎస్14 ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల ఓలెడ్ డిస్ప్లే ఉంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. వివోబుక్ 14 ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు.
ఎస్14 ల్యాప్‌టాప్ కేవలం 1.4 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని ప్రయాణాల్లో చాలా సులభంగా తీసుకెళ్లవచ్చు. పూర్తిగా మెటల్ బాడీతో దీన్ని రూపొందించారు. వివోబుక్ 14 ల్యాప్‌టాప్ 1.46 కిలోల బరువు ఉంటుంది. ఈ రెండు ల్యాప్‌టాప్‌లను మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో రూపొందించారు. అందువల్ల చాలా దృఢంగా ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌లలో ఏఎండీ రైజెన్ ఏఐ7 350 ప్రాసెసర్‌ను అమర్చారు. కనుక ఏఐ ఫీచర్లను ఎలాంటి ఆటంకం లేకుండా ఉపయోగించుకోవచ్చు. అసుస్ ఐస్కూల్ టెక్నాలజీని వీటిల్లో ఏర్పాటు చేశారు. కనుక అతిగా వేడికి గురికాకుండా ఉంటాయి. వివోబుక్ ఎస్14 ల్యాప్‌టాప్‌లో 70 వాట్ అవర్ బ్యాటరీ ఉండగా 23 గంటల వరకు బ్యాకప్ వస్తుంది. యూఎస్బీ టైప్ సి చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది. హెచ్డీఎంఐ 2.1, యూఎస్బీ టైప్ సి పోర్టులు ఉన్నాయి.
ఏఐ ఫీచర్ల విషయానికి వస్తే విండోస్ స్టూడియో ఎఫెక్ట్స్, లైవ్ క్యాప్షన్స్, అసుస్ స్టోరీ క్యూబ్ వంటి ఫీచర్లను పొందవచ్చు. రెండు ల్యాప్‌టాప్‌లలోనూ మైక్రోసాఫ్ట్‌కు చెందిన కోపైలట్ ప్లస్ ఫీచర్లు లభిస్తాయి. ప్రత్యేకంగా కోపైలట్ కీని కూడా అందిస్తున్నారు. కనుక ఏఐ ఫీచర్లను చాలా వేగంగా యాక్సెస్ చేయవచ్చు. ఇక వివోబుక్ 15 ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ ఐ3-1315యు ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. 15.6 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. అన్ని ల్యాప్‌టాప్‌లలోనూ విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఏడాది పాటు మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ వెర్షన్‌ను, ఆఫీస్ హోమ్ 2024 ఎడిషన్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. 16జీబీ నుంచి 32 జీబీ వరకు ర్యామ్ అప్‌గ్రేడబుల్ ఆప్షన్లు లభిస్తున్నాయి. 512జీబీ ఎస్ఎస్డీని ఏర్పాటు చేశారు. వైఫై 6 కనెక్టివిటీ ఉంది. బ్లూటూత్ 5.3కి సపోర్ట్‌ను ఇచ్చారు.
అసుస్ వివోబుక్ 14 (M1407KA) ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.65,990 ఉండగా దీన్ని అమెజాన్‌తోపాటు అసుస్ ఇ-షాప్‌లో విక్రయిస్తున్నారు. అసుస్ వివోబుక్ ఎస్14 (M3407KA) ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.75,990 ఉండగా దీన్ని అమెజాన్‌తోపాటు అసుస్ ఇ-షాప్‌లో కొనుగోలు చేయవచ్చు. అసుస్ వివోబుక్ 14 (X1407CA) ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.42,990 ఉండగా దీన్ని ఫ్లిప్‌కార్ట్, అసుస్ ఇ-షాప్ లో అందిస్తున్నారు. అసుస్ వివోబుక్ 15 (X1504VA-BQ323WS) ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.70,990 ఉండగా దీన్ని కూడా ఫ్లిప్‌కార్ట్, అసుస్ ఇ-షాప్‌లో కొనుగోలు చేయవచ్చు.