Asus Computers | మీరు అద్భుతమైన ఫీచర్లు కలిగిన గేమింగ్ పీసీలు లేదా ఆలిన్ వన్ డెస్క్‌టాప్‌లను కొనాలని చూస్తున్నారా.. అయితే మీకోసమే అసుస్ సరికొత్తగా అలాంటి పీసీలనే లాంచ్ చేసింది. ఈ డెస్క్‌టాప్ పీసీలు బడ్జెట్ ధరలో లభించడమే కాదు, ఆకట్టుకునే ఫీచర్లను కూడా కలిగి ఉన్నాయి. ఆర్వోజీ, టీయూఎఫ్ సిరీస్‌లలో ఈ నూతన పీసీలను అసుస్ లాంచ్ చేసింది. టీయూఎఫ్ గేమింగ్ టి500 డెస్క్టాప్ను అసుస్ లాంచ్ చేసింది. ఇందులో ఇంటెల్ కోర్ ఐ5-13420హెచ్ ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. ఎన్వీడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 జీపీయూలను కూడా అందిస్తున్నారు. 16జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్డీని ఏర్పాటు చేశారు.
ఈ పీసీలో ర్యామ్‌ను యూజర్లు ఏకంగా 64జీబీ వరకు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. స్టోరేజ్‌ను 4టీబీ వరకు పెంచుకోవచ్చు. వైఫై 6, బ్లూటూత్ 5.4కు సపోర్ట్‌ను ఈ పీసీల్లో అందిస్తున్నారు. ఆర్జీబీ లైటింగ్ కూడా ఇందులో ఉంది. పూర్తిగా స్టైలిష్ గా ఉండేలా క్యాబినెట్‌ను తీర్చి దిద్దారు. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ పీసీలో పొందవచ్చు. 3.5 ఎంఎం ఆడియో జాక్ పోర్టు, యూఎస్బీ టైప్ సి పోర్టులు, టైప్ ఎ పోర్టులు, ఆర్జే 45 గిగాబిట్ ఈథర్నెట్ పోర్టు, హెచ్డీఎంఐ, డిస్ప్లే పోర్టులు, ఆడియో పోర్టులను ఏర్పాటు చేశారు.
ఆర్వోజీ 700 పీసీని హై ఎండ్ గేమర్స్, గ్రాఫిక్స్ క్రియేటర్స్ కోసం లాంచ్ చేశారు. ఇందులో యూజర్లకు ఇంటెల్ కోర్ అల్ట్రా 9 285కె ప్రాసెర్ ఉంది. ఎన్వీడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5080 జీపీయూ లభిస్తుంది. 32జీబీ వరకు ర్యామ్, 2టీబీ ఎస్ఎస్డీని డిఫాల్ట్ గా అందిస్తున్నారు. ఈ సీసీకి ఆర్జీబీ లైటింగ్ కూడా ఉంది. 850 వాట్ల పవర్ సప్లైని ఇచ్చారు. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఇతర అన్ని రకాల పోర్టులను కూడా ఈ పీసీలో పొందవచ్చు. ర్యామ్, స్టోరేజ్‌ను కావాలంటే అప్‌గ్రేడ్ కూడా చేసుకోవచ్చు.
అలాగే వి440వీఏ, వి470 వీఏ ఆలిన్ వన్ పీసీలను కూడా అసుస్ లాంచ్ చేసింది. వి440వీఏ ఆలిన్ వన్ పీసీలో 24 ఇంచుల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఇన్‌బిల్ట్‌గా లభిస్తుంది. ఇంటెల్ కోర్ ఐ5-13420హెచ్ ప్రాసెసర్ లభిస్తుంది. 16జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీని అందిస్తున్నారు. కావాలంటే వీటిని అప్ గ్రేడ్ చేసి కూడా ఇస్తారు. ఈ పీసీలో విండోస్ 11 హోమ్ ఎడిషన్‌ను పొందవచ్చు. గ్రాఫిక్ కార్డు లేదు. ఇంటిగ్రేడెడ్ గ్రాఫిక్స్‌ను వాడుకోవచ్చు. ఇతర అన్ని రకాల పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే వి470వీఏ ఆలిన్ వన్ పీసీలో 27 ఇంచుల డిస్ప్లే ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. ఇంటెల్ కోర్ ఐ7-13620హెచ్ ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్డీని ఏర్పాటు చేశారు. ర్యామ్, స్టోరేజ్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇందులోనూ విండోస్ 11 హోమ్ ఓఎస్‌ను ఇస్తున్నారు. ఇక ఇతర అన్ని రకాల పోర్టులు కూడా ఉన్నాయి.
ఆర్వోజీ జి700 పీసీ ధర రూ.3,59,990 ఉండగా, టీయూఎఫ్ గేమింగ్ టి500 పీసీ ధర రూ.84,990గా ఉంది. వి440వీఏ పీసీ ధర రూ.49,990 ఉండగా, వీ470వీఏ ఆలిన్ వన్ పీసీ ధర రూ.51,990గా ఉంది. ఈ పీసీలను అసుస్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ స్టోర్స్, క్రోమా స్టోర్స్, ఇతర రిటెయిల్ స్టోర్స్‌లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.