Moon | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : చంద్రుడి దక్షిణ భాగం (ఫార్ సైడ్)లో విస్తారమైన రెండు లోయలు ఉన్నట్టు లూనార్ అండ్ ప్లానెటరీ ఇన్స్టిట్యూట్ (ఎల్పీఐ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎన్నో ఏండ్ల క్రితం ఓ గ్రహశకలం గంటకు దాదాపు 55 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొనడం వల్ల ఈ లోయలు ఏర్పడ్డాయని, ఆ భారీ పేలుడుతో వెలువడిన శక్తి ఒకేసారి 130 అణుబాంబులు పేలడం ద్వారా వెలువడే శక్తి కంటే అధికమైనదని ప్రకటించారు. గ్రహవ్యవస్థ కల్లోలంగా ఉన్న సమయంలో గ్రహశకలాలు, తోకచుక్కలు ఢీకొని భూమి, చంద్రుడు తిరిగి పైకి వస్తున్నప్పుడు ఈ లోయలు ఏర్పడ్డాయని, ఇవి అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ అంత వెడల్పు, లోతు ఉన్నాయని తెలిపారు. వీటిలో ‘వల్లిస్ ప్లాంక్’ అనే లోయ 280 కి.మీ (174 మైళ్ల) పొడవు, 3.5 కి.మీ (2.2 మైళ్ల) లోతు, ‘వల్లిస్ ష్రింగర్’ అనే మరో లోయ 270 కి.మీ (168 మైళ్ల) పొడవు, 2.7 కి.మీ (1.7 మైళ్ల) లోతు ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలిందని వివరించారు.
ఈ అధ్యయన వివరాలు ‘జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్’లో ప్రచురితమయ్యాయి. గతంలో ఓ గ్రహశకలం లేదా తోకచుక్క చంద్రుడి దక్షిణ ధృవంలో ఉన్న మాలాపెర్ట్, మౌటన్ పర్వత శిఖరాల మీదుగా దూసుకొచ్చి జాబిల్లిని ఢీకొన్నదని, దీంతో ఎగసిపడిన శిథిలాలు గంటకు దాదాపు 3,600 కి.మీ (2,237 మైళ్ల) వేగంతో చంద్రుడి ఉపరితలంపై పడటంతో ఈ లోయలు ఏర్పడ్డాయని ఈ అధ్యయన పత్రం ప్రధాన రచయిత డేవిడ్ క్రింగ్ పేర్కొన్నారు. అమెరికాలో గ్రాండ్ కాన్యన్ ఏర్పడేందుకు మిలియన్ల సంవత్సరాలు పట్టినప్పటికీ చంద్రుడిపై ఈ రెండు లోయలు 10 నిమిషాల్లోపే ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన రోబోటిక్ లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్ సేకరించిన సమాచారాన్ని ఉపయోగించుకుని ఈ లోయలను గుర్తించినట్టు తెలిపారు.