Acer Iconia Tab iM11 | ప్రస్తుతం కేవలం స్మార్ట్ ఫోన్లే కాదు, ట్యాబ్లెట్ పీసీలకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. అందులో భాగంగానే కంపెనీలు కూడా వినియోగదారులను ఆకర్షించే రీతిలో నూతన తరహా ట్యాబ్‌లను తయారు చేసి అందిస్తున్నాయి. బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లను ట్యాబ్‌లలో అందిస్తున్నాయి. అదే కోవలో కంప్యూటర్స్ తయారీదారు అయిన ఏసర్ కూడా ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఏసర్ కంపెనీ ఐకానియా ట్యాబ్ ఐఎం11 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌లో 11.45 ఇంచుల 2.2కె ఐపీఎస్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి క్వాడ్ స్టీరియో స్పీకర్స్‌ను అందిస్తున్నారు. ప్యూర్ వాయిస్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం వల్ల సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. చాలా పలుచగా ఉండే స్లీక్ డిజైన్‌తో ఈ ట్యాబ్‌ను రూపొందించారు. కేవలం 8 ఎంఎం మందం మాత్రమే ఉంటుంది.
ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ హీలియో జి99 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ ట్యాబ్‌కు గాను స్టైలస్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫ్లిప్ కవర్, డిటాచబుల్ బ్లూటూత్ కీబోర్డు విత్ ట్రాక్ పాడ్‌ను కూడా పొందవచ్చు. ఈ ట్యాబ్‌లో ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయగా, వెనుక వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ ట్యాబ్‌లో అందిస్తున్నారు. 7400 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేశారు. ఇందులో మైక్రె ఎస్‌డీకార్డును కూడా వేసుకోవచ్చు. 1 టీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. 4జీ సేవలను పొందేందుకు వీలుగా సిమ్ స్లాట్ సౌకర్యాన్ని కల్పించారు. డ్యుయల్ బ్యాండ్ వైఫైని అందిస్తున్నారు.
ఈ ట్యాబ్‌లో బ్లూటూత్ 5.2 సదుపాయం కూడా ఉంది. ఈ ట్యాబ్ ద్వారా 8 గంటల వరకు నాన్ స్టాప్ వీడియో ప్లేబ్యాక్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో ఉన్న భారీ బ్యాటరీకి గాను 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌కు ఏడాది వారంటీ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఏసర్ ఐకానియా ట్యాబ్లెట్ ఐఎం11 ట్యాబ్‌ను కేవలం బ్లూ కలర్ ఆప్షన్లో మాత్రమే లాంచ్ చేశారు. ఈ ట్యాబ్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999గా ఉంది. ఈ ట్యాబ్‌ను ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు ఏసర్ ఆన్లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ సైట్లలోనూ కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్లో 4జి సదుపాయం కలిగిన ట్యాబ్గా ఈ డివైస్ ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.