శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Oct 03, 2020 , 05:09:17

ప్రభుత్వ భూమి అమ్మినా.. కొన్నా క్రిమినల్‌ కేసులు

ప్రభుత్వ భూమి అమ్మినా.. కొన్నా క్రిమినల్‌ కేసులు

సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు  

కంది: ప్రభుత్వ భూములను అమ్మినా, కొన్నా ఇద్దరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు. శుక్రవారం కంది మండల కేంద్రంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కందిలోని సర్వే నెం.656లోని ప్రభుత్వ భూమిపై ఎలాంటి అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి ఏమైనా లావాదేవీలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూమిని తరతరాలుగా సాగు చేసుకోవచ్చు కానీ, అమ్మతే ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అమ్మినా, కొన్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో మధ్య దళారులను కూడా గుర్తించి వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ కొనుగోళ్లు ఏవైనా జరిగినట్లయితే తమకు తెలియజేయాలని, తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కలెక్టర్‌ చెప్పారు.

ప్రతి నిర్మాణ వివరాలు పూర్తి చేయాలి

 గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటి, ఇతర నిర్మాణాల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ సూచించారు. కంది మండల కేంద్రంలో కొనసాగుతున్న నమోదు ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. యజమాని పేరు, ఆధార్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌, నిర్మాణ స్వభావం, విస్తీర్ణం కొలతలు తీసుకుని నమోదు చేయాలన్నారు. అన్ని రకాల నిర్మాణాలు ఆన్‌లైన్‌లో నమోదు అయితే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులకు ఆయన సూచించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి యజమానితో మాట్లాడి అన్ని వివరాలను సేకరించాలని ఆయన తెలిపారు. కలెక్టర్‌ వెంట డీఎల్‌పీవో సతీష్‌రెడ్డి, కంది సర్పంచ్‌ విమల వీరేశం, ఈవో వాణి ఉన్నారు.logo