మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - May 13, 2020 , 00:25:26

నిబంధనలు పాటిస్తూ..నిరాటంకంగా..

నిబంధనలు పాటిస్తూ..నిరాటంకంగా..

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర సర్కారు లాక్‌డౌన్‌ను సడలించడంతో ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నెల 8 నుంచి ఆర్టీఏ ఆఫీసుల్లో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌, మెదక్‌, సిద్దిపేటలో ఆర్టీఏ ప్రధాన కార్యాలయాలున్నాయి. అన్నింటిలో డ్రైవింగ్‌ లైసెన్సులు, లెర్నింగ్‌ లైసెన్సులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని అందులో సూచించిన సమయానికి వచ్చి తమ పనిచేయించుకుంటున్నారు. ఈ నెల 8, 11, 12 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో 325 ఫైళ్లను అధికారులు క్లియర్‌ చేశారు.

కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు..

కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ఆర్టీఏ కార్యాలయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుని, అందుకు సంబంధించిన పత్రాలు చూపించిన వారిని గేట్ల నుంచి కార్యాలయాల్లోకి అనుమతిస్తున్నారు. లోపలికి వెళ్లగానే గేటు వద్ద వైద్య పరీక్షలు చేస్తున్నారు. చేతులను శానిటైజ్‌ చేసుకున్న తర్వాతే, లోపలికి పంపిస్తున్నారు. లోపల కూడా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.   మూడు రోజుల్లో 20 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, 56 లెర్నింగ్‌, 43 కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌లను జారీ చేశారు. అలాగే, 83 ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇచ్చారు. వీటితో పాటు పాత వాహనాలను ఒకరి నుంచి వేరొకరి పేరున మార్పుతో పాటు ఇతర రకాల 123 ఫైళ్లు క్లియర్‌ చేశారు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని కార్యాలయాలకు రావాలని, ఇక్కడ అమలు చేస్తున్న నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఉమ్మడి జిల్లా రవాణా శాఖ అధికారి శివలింగం ‘నమస్తేతెలంగాణ’ ప్రతినిధితో వెల్లడించారు. logo