ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Mar 15, 2020 , 00:20:46

టార్గెట్‌ రూ.11.85 కోట్లు

టార్గెట్‌ రూ.11.85 కోట్లు

ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో అధికారులు పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో బల్దియా అధికారులు, సిబ్బంది పన్ను వసూలులో నిమగ్నమయ్యారు. అన్ని మున్సిపాలిటీల్లో కలిసి రూ.37.35 కోట్ల వరకు పన్నులు రావాల్సి ఉండగా, శనివారం వరకు రూ.25.50 కోట్లు వసూలయ్యాయి. రూ.11.85 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయని అధికారులు తెలిపారు. 31వ తేదీ వరకు 100 శాతం వసూలు చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ, కమిషనర్లు సహా సిబ్బంది పన్ను వసూలుకు ఇంటింటికీ వెళ్తున్నారు.

  • జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలు
  • మొత్తం పన్ను రూ. 37.35 కోట్లు
  • వసూలైన మొత్తం రూ.25.50 కోట్లు
  • ఇంకా వసూలు కావాల్సింది రూ.11.85 కోట్లు
  • అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేక డ్రైవ్‌
  • నెలాఖరు వరకు వసూలు చేసేలా అధికారుల చర్యలు

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీల్లో పన్నుల వసూలుపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ నెలాఖరుతో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో మున్సిపల్‌ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ మినహా మిగతా అధికారులు, సిబ్బంది అంతా పన్ను వసూలులోనే బిజీగా ఉంటున్నారు. జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో కలిసి రూ.37.35 కోట్ల వరకు పన్నులు రావాల్సి ఉండగా, శనివారం వరకు రూ.25.50 కోట్లు వసూలు అయ్యాయి. మిగతా రూ.11.85 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. 68.27 శాతం వరకు పన్నులు వసూలు కాగా, 31వ తేదీ వరకు పూర్తి 100శాతం వసూలు చేయాలని టార్గెట్‌ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం 6 గంటల నుంచే సిబ్బంది మున్సిపాలిటీల్లో వసూలు చేస్తున్నారు. కమిషనర్‌తో సహా అందరూ వసూలు కోసం తిరుగుతున్నారు. గడువులోగా పన్నులు కట్టని వారికి ఈ నెలాఖరు తరువాత ఫైన్‌తో పన్నులు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్లు చెబుతున్నారు. అమీన్‌పూర్‌, బొల్లారం, తెల్లాపూర్‌, నారాయణఖేడ్‌ నాలుగు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడిన విషయం తెలిసిందే. కొత్త వాటితో కలిసి జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య రెట్టింపు అయ్యింది. 


అమీన్‌పూర్‌ ఫస్ట్‌ అందోలు లాస్ట్‌...

పన్నుల వసూలులో కొత్తగా ఏర్పడిన అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ ముందున్నది. ఇక్కడ 82.83 శాతం పన్నులు వసూలు అయ్యాయి. రూ.7.95 కోట్లకు గాను, రూ.6.58 కోట్లు వసూలు అయ్యాయి. ఇంకా కేవలం రూ.1.36 కోట్లు రావాల్సి ఉన్నది. వారం రోజుల్లోనే మిగతా మొత్తాన్ని వసూలు చేసేలా సిబ్బంది పనిచేస్తున్నారు. అమీన్‌పూర్‌ తరువాత వసూలులో బొల్లారం మున్సిపాలిటీ ఉన్నది. ఇక్కడ 69.89 శాతం పన్నులు వసూలు చేశారు. రూ.8.40 కోట్లకు గాను, రూ. 5.87 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.2.53 కోట్లు రావాల్సి ఉన్నది. కాగా, అతి తక్కువగా అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో 57.99 శాతం మాత్రమే పన్నులు వసూలు అయ్యాయి. రూ.7 కోట్లకు గాను, రూ.4 కోట్లు వసూలు కాగా, ఇంకా రూ.2.9 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. నారాయణఖేడ్‌లో కూడా రూ.58.81శాతం మాత్రమే పన్నులు వసూలు అయ్యాయి. రూ.3.2 కోట్లకు గాను, రూ.1.8 కోట్లు వసూలు అయ్యాయి. ఇంకా 1.3 కోట్లు వసూలు కావాల్సి ఉన్నది. మిగతా తెల్లాపూర్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేట మున్సిపాలిటీల్లో కూడా 65శాతం లోపే పన్నులు వసూలు కాగా, అధికార యంత్రాంగం సీరియస్‌గా వసూలు చేస్తున్నారు.


ప్రత్యేక కౌంటర్లు,  ఉదయమే డ్యూటీలోకి...

పన్నుల వసూలుపై మున్సిపల్‌ సిబ్బంది సీరియస్‌గా పనిచేస్తున్నది. ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు వసూలుపైనే ప్రధాన దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లో 31లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక చెల్లింపు కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం కూడా కౌంటర్లు తెలిచి ఉండేలా చూస్తామంటున్నారు. సాధారణ రోజుల్లో మున్సిపల్‌ సిబ్బంది 8 గంటల నుంచి విధుల్లో చేరుతుంటారు. వసూలు కోసం ఉదయం 6 గంటలకే బకాయిదారుల ఇండ్ల వద్దకు వెళ్తున్నారు. కమిషనర్‌ మొదలుకుని కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పన్నులు చేస్తున్నారు. బిల్‌కలెక్టర్లు, సిబ్బంది ఇండ్ల వద్దకు వెళ్లి బకాయి చెల్లించే వరకు వెళ్లడం లేదు. దీంతో చాలా వరకు వసూళ్లు అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 31 వరకు దాదాపుగా వసూలు అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఈ నెల 31 తరువాత ఫైన్‌తో...

ఈ నెలాఖరు వరకు బకాయి ఉన్న పన్నులు చెల్లించని యెడల ఏప్రిల్‌ 1 నుంచి ఫైన్‌తో పన్నులు తీసుకుంటాం. మున్సిపల్‌ సిబ్బందికి ప్రజలకు సహకరించాలి. అందరూ తప్పకుండా పన్నులు చెల్లించాలి. పట్టణ ప్రజల సౌకర్యం కోసమే ఆదివారం, సెలవు రోజు కూడా కౌంటర్లు అందుబాటులో ఉంచుతున్నాం. ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటును సద్వినియోగం చేసుకోవాలి. వేకువజామునే సిబ్బంది విధుల్లో చేరి వసూలుకు వెళ్తున్నారు. నాతో సహా అందరూ 100 శాతం పన్ను వసూలు లక్ష్యంగా పనిచేస్తున్నాం. అమీన్‌పూర్‌లో 31 వరకు 100 శాతం పన్నులు వసూలు అవుతాయనే నమ్మకం ఉన్నది.

- సుజాత, మున్సిపల్‌ కమిషనర్‌, అమీన్‌పూర్‌


logo