బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Feb 26, 2020 , 23:32:45

రేపటి నుంచి రాచన్నస్వామి జాతర

రేపటి నుంచి రాచన్నస్వామి జాతర

కోహీర్‌ : ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరిన బడంపేట రాచన్నస్వామి దేవాలయం ఉత్సవాలకు ముస్తాబైంది. భక్తుల కోర్కెలు తీర్చే రాచన్నస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు కనుల పండువగా కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. 


ఆలయ చరిత్ర...

మండలంలోని బడంపేట రాచన్నస్వామి దేవాలయం 300 ఏండ్ల క్రితం నిర్మితమైందని పురాణాల్లో రాసి ఉన్నది. బడంపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో బాలుడి రూపంలో ఉన్న రాచన్నస్వామిని పశువుల కాపరులు చూస్తారు. బాలుడి రూపంలో ఉన్న స్వామివారు గంధం చెట్లపై ఆడుతుండగా కిందకు దిగాలని కాపరులు వేడుకుంటారు. అయినా అతను వినలేదు. చికటి అవుతున్నది భయం వేయడం లేదా..? అని బాలున్ని ప్రశ్నించడంతో నాకు ఎలాంటి భయం లేదని సమాధానమిచ్చాడు. చెట్టుపై నుంచి పడితే దెబ్బలు తగులుతాయి.. కిందకు దిగి రావాలని మరోసారి కోరారు. తాను గ్రామానికి వస్తాను.. కానీ వెనుకకు తిరిగి ఎవరూ నన్ను చూడొద్దని బాలుడి రూపంలో ఉన్న స్వామివారు చెబుతారు. ఇందుకు సరే అని చెప్పి గ్రామ పెద్దలకు సమాచారమందించారు. అటవీ ప్రాంతానికి వెళ్లి మంగళవాయిద్యాలతో తీసుకొస్తుందడగా ప్రస్తుతం ఉన్న దేవాలయం వరకు రాగానే కొంతమంది వెనక్కి తిరిగి చూస్తారు. వెంటనే బాలుడి రూపంలో ఉన్న స్వామివారు లింగాకారంగా మారిపోతాడు. 300 ఏండ్ల క్రితం లింగాకారంగా మారిన ప్రదేశంలోనే ఆలయాన్ని గ్రామస్తులు నిర్మించారు. అప్పటి నుంచి స్వామివారికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 


28న బ్రహ్మోత్సవాలు ప్రారంభం...

పాల్గుణ శుద్ధ పంచమిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఐదు గంటలకు వీరభద్రావతారంలో రాచన్నస్వామికి రుద్రాభిషేకం, భద్రకాళిదేవికి కుంకుమార్చన చేపట్టనున్నారు. 8 గంటలకు కర్ణాటకలోని మల్కేడ్‌ ఆశ్రమ పీఠాధిపతి గురుగంగాధరస్వామి చేతుల మీదుగా ధ్వజారోహణం, శిఖరపూజ చేయనున్నారు. 12 గంటలకు జహీరాబాద్‌ పట్టణానికి చెందిన కౌలాస్‌ కుటుంబీకుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి స్వామివారి ప్రవచనాలు, హరికథ, బుర్రకథ, భజనలు చేస్తారు. రాత్రి 12 గంటలకు ఆలయం ముందు అగ్ని ప్రతిష్ఠ చేయనున్నారు. 29న ఉదయం 4.15 గంటలకు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, మంగళహారతి చేపట్టనున్నారు. అనంతరం రాచన్నస్వామికి పల్లకీ సేవ నిర్వహిస్తారు. అనంతరం అగ్గి తొక్కడం ప్రారంభిస్తారు. మార్చి 1న రాచన్నస్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, మహా మంగళహారతి కౌలాస్‌ కుటుంబీకులు చేయనున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు భద్రకాళిదేవి సమేత రాచన్నస్వామి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా జరుగనుంది. 


భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం...

పాల్గుణ శుద్ధ పంచమి నుంచి పాల్గున శుద్ధ సప్తమి వరకు నిర్వహించే రాచన్నస్వామి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయండి. ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి కృపను పొందండి. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. నిత్య అన్నదానం నిర్వహిస్తాం.

- శివరుద్రప్ప, బడంపేట ఆలయ ఈవో 


కోర్కెలు నెరవేరుతాయి

బడంపేట రాచన్నస్వామి దేవాలయంలో అపర వీరభద్రావతారంలో స్వామివారు కొలువుదీరాడు. ఇక్కడ అత్యంత మహిమలున్నాయి. ఆత్మశుద్ధిని పాటిస్తే భక్తులు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది.

- జగదీశ్వర్‌స్వామి, అర్చకుడు 


logo