గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jan 24, 2020 , 04:51:38

రూ.5౦౦కోట్లతో పిరమల్‌ విస్తరణ

రూ.5౦౦కోట్లతో పిరమల్‌ విస్తరణ
  • -మంత్రి కేటీఆర్‌తో సంస్థ చర్చలు
  • - నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు


కోహీర్‌: నిరుద్యోగులకు శుభవార్త. ఇక్కడి పరిసర ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు మంత్రి కేటీఆర్‌ దిగ్వాల్‌ పిరమల్‌ పరిశ్రమ యజమాని అజయ్‌ పిరమల్‌తో బుధవారం భేటీ అయ్యారు. పిరమల్‌ యాజమాన్యం రూ.500కోట్ల పెట్టుబడితో పరిశ్రమను విస్తరించేందుకు ముందుకు వచ్చింది. దిగ్వాల్‌ గ్రామ శివారులో 1989 సంవత్సరంలో 150 మందితో ప్రారంభించిన సుమిత్రా ఫార్మా పరిశ్రమ నేడు రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నది. ప్రస్తుతం పిరమల్‌ పరిశ్రమలో 177 పర్మినెంటు కార్మికులు, స్టాఫ్‌లో 700మంది, మరో 700మంది కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. 100ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పరిశ్రమలో మూడు యూనిట్లకు  సుమారుగా 3వేల కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. మరో ఐదు వందల కోట్ల పెట్టుబడితో మరో యూనిట్‌ను నిర్మించేందుకు పిరమల్‌ యాజమాన్యం సిద్ధంగా ఉన్నది. ఇందులో భాగంగా  మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపారు. ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమతో 2వేల మంది వరకు ఉపాధి లభిస్తున్నదని మంత్రి కేటీఆర్‌కు వివరించారు. సామాజిక భద్రత కింద గ్రామానికి సురక్షిత తాగునీరు. వైద్య సేవలందిస్తామని వివరించారు. రూ.500 కో ట్ల పెట్టుబడితో నిర్మించే యూ నిట్‌ ద్వారా వెయ్యిమందికి పైగా నిరుద్యోగులు ఉపాధి పొందనున్నారు.

నిరుద్యోగులకు ఉపాధి -ఎమ్మెల్యే మాణిక్‌రావు

500 కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టే పరిశ్రమ విస్తరణ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. దీంతో తమ కుటుంబాలను పోషించుకునే అవకాశం దొరుకుతుంది. ఇక్కడి ప్రాంత నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.  


logo