సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Jan 22, 2020 , 01:32:30

ఆలోచించి ఓటేద్దాం...

ఆలోచించి ఓటేద్దాం...
  • - మంచి నాయకుడిని ఎన్నుకుందాం
  • - నిస్వార్థపరుడు, సేవాగుణం ఉన్న వారికే మద్దతునివ్వాలి
  • - వార్డు అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పరితపించే వారు ఉండాలి


అందోల్, నమస్తే తెలంగాణ:  ప్రజా సమస్యలు తెలిసినవాడు. నిస్వార్థపరుడు, సేవాగుణం కలిగిన నాయకుడిని ఎన్నుకుందాం. ఆలోచించి ఓటేస్తేనే అభివృద్ధి కండ్ల ముందు కనువిందు చేస్తుంది. సమస్యలను పరిష్కరించి, ప్రజా సంక్షేమానికి పరితపించే మంచి నాయకుడికి ఓటు వేద్దాం. మార్గ నిర్దేశకత్వం, నిర్ణయం, మధ్యవర్తిత్వం, చక్కగా ఉపన్యాసం ఇవ్వగలిగే సత్తా, ఉత్తమ శ్రోత అయి ఉండడం, మంచి చొరువ, కలుపుగోలుతనం, చక్కటి సమన్వయకర్తగా సమస్యలకు పరిష్కారం చూపించే తత్వాలు వంటి కలిగి లీడర్ ఎన్నుకునేందుకు ఆలోచించి ఓటు వేద్దాం. నేడు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదర్శవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..

మంచి నాయకత్వం వార్డు, ప్రాంతాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నది. ప్రజల కష్టాలు, కన్నీళ్లలో అండగా నిలుస్తున్నది. ఇంటింటికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నది. కుల వృత్తులకు పునర్జీవం పోసి, బతుకుదెరువును చూపుతున్నది. ఎన్నో ఏండ్ల సమస్యలకు పరిష్కారం చూపి, వార్డులను ప్రగతి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నది. ఫలితంగా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తున్నది. అందుకే ఎన్నికల వేళ ప్రజలంతా ఆలోచించాలి. ఒక ఆదర్శవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఈ నేపథ్యంలో ‘మీకు వార్డు కౌన్సిలర్ ఎలాంటి నాయకుడు కావాలి’ అన్నది మీ చేతుల్లోనే ఉంది. స్థానికంగా అందుబాటులో ఉండేవాడు, నిస్వార్థపరుడు, సేవాతత్పరుడు, నిజాయితీ పరుడు, ప్రజల పక్షాన నిలచే, వార్డు బాగు కోసం పరితపించే వారిని ఎన్నుకోవాలి.

ఒక కుటుంబం, ఒక కార్మాగారం, ఒక కార్యాలయం, సమాజం, రాష్ట్రం ఇలా వ్యవస్థ రూపం ఏదైనా కావచ్చు. ఈ వ్యవస్థకు దిశా నిర్దేశం చేసి ముందుకు నడిపించే వాడే నాయకుడు, సమష్టిగా లక్ష్యసాధనకు, తమ తోటి వారిని ప్రభావితం చేయగలుగుతూ, ముందుండి నడిపించగల సామర్థ్యం కలిగి ఉండాలి. అలాంటి వారే లీడర్ అవుతారు. పది మందికి ఆదర్శంగా నిలువాలి. మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కొన్నింటిని ‘నమస్తే తెలంగాణ’వివరిస్తున్నది.

నాయకత్వ లక్షణాలు..

నాయకుడిగా ఎదుగాలంటే తొమ్మిది రకాల లక్షణాలు ఉండాలి. మార్గ నిర్దేశకత్వం, నిర్ణయం, మధ్యవర్తిత్వం, ఆశాజీవిగా ఉండడం, చక్కగా ఉపన్యాసం ఇవ్వగలిగే సత్తా, ఉత్తమ శ్రోత అయి ఉండడం(అంటే ఇతరులు చెప్పే విషయాలను వినడం), మంచి చొరవ, కలుపుగోలుతనం, చక్కటి సమన్వయకర్తగా సమస్యలకు పరిష్కారం చూపించే తత్వం కలిగి ఉండాలి.

మార్గ నిర్దేశకత్వం..

సమస్య వచ్చినప్పుడు పరిష్కారం అవసరం. ఇబ్బందులను తీర్చే సమయంలో మార్గనిర్దేనం చేసి అది, అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా చూడాలి. సమస్య లోతుపాతులు క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం, తన నిర్ణ యం ఎవరినీ నొప్పించకుండా ఉండాలి. ఎదుటి వారికి అర్థమయ్యేలా తెలుపాలి.

చక్కని ఉపన్యాసం..

నాయకులు నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణం చక్కగా అర్థమయ్యేలా సూటిగా మాట్లాడడం, జనాన్ని సమీకరించడంలోనూ, వాక్చాతుర్యంతో వారి మనస్సును కదిలించడంలోనూ ఎక్కువగా ఉపయోగపడేది ఉపన్యాసం. మాతృభాషలోనే చెప్పడం మంచిది.

నిర్ణయాత్మక అధికారం 

నాయకత్వంలో నిర్ణయాత్మక అధికారం అనేది ఇక ప్రధాన అంశం. ఎవరి నిర్ణయాన్నో అమలు చేసినట్లయితే మనం నాయకత్వం మంచి కార్యనిర్వాహక స్థాయికి పడిపోయినట్లే. నిర్ణయం అనేది పక్కాగా ఉండాలి. ఎందుకంటే అందులో ముఖ్యంగా కుటుంబం లేదా గ్రామస్థాయి, గ్రామ పరిధి దాటిన అంశాలు ఉండవచ్చు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయపరమైన అంశాల్లో నాయకుడు తన నిర్ణయాలను ప్రకటించాల్సి వస్తున్నది. వేగంగా ఆలోచించడమే కాకుండా అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మధ్యవర్తిత్వం..

ప్రస్తుతం సమస్యలు, తగాదాలు నిజ జీవితంలో భాగమయ్యాయి. అవి అలాగే వదిలేస్తే పెరిగిపోతాయి. రాజీమార్గాన్ని ఎంచుకుని కుటుంబం మొదలుకొని వ్యక్తుల మధ్య వనరుల పంపిణీ వరకు వివిధ రకాల సమస్యలను ఎదురైనప్పుడు నాయకుడు మధ్యవర్తిత్వం వహించి పరిష్కారం చూపాలి. మన నిర్ణయం నిజాయితీగా, ఇరుపక్షాలకు నచ్చేలా, నష్టం కాకుండా చూసుకోవాలి. అంతేగాక చొరవ, కలివిడి తనం, విశ్లేషణ, ఒప్పించే నేర్పులాంటివి తప్పనిసరి.

ఉత్తమ శ్రోత..

మనం చెప్పేది ఎదుటివారు వినాలనుకొని మనం ఎంత అత్రుతపడతామో, ఎదుటివారు చెప్పేది మనం వినడానికి సిద్ధం కావాలి. తనకు నచ్చని విషయాలు ఉన్నా ఓర్పుగా వినాలి. అప్పుడు ఎదుటివారు మన మాట వింటారు. అందరూ సరళంగా, సూటిగా మాట్లాడలేకపోవచ్చు. అలాంటి వారిని చిన్నచూపు చూడొద్దు. ఇలాంటి లక్షణాలే ఓ వ్యక్తిని మంచి నాయకుడిగా చేస్తాయి.

సమన్వయకర్తగా...

ఒంటరిగా చేసే పనుల్లో ఒక పని తర్వాత మరొక పనిని చాకచక్యంగా చేయడం సమన్వయం, నలుగుర్ని ఒప్పించేలా, అందరూ మనతో కలిసివచ్చేలా చేయడం సమన్వయం, ఏదైనా సందర్భంలో ఏకాభిప్రా యం రానప్పుడు ఎక్కువ మం ది చెప్పిన అభిప్రాయాన్ని అం దరూ అంగీకరించేటట్లు చే యాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించి తీర్మాణాలు చేయాలి.

ఆశాజీవిగా ఉండాలి..

నిత్యం ఎదురయ్యే ఎదురుదెబ్బలను తలుచుకొని కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలి. పరిష్కారమార్గాన్ని చూపుకుంటూ ముందుకు సాగాలి. సమస్యల పరిష్కారంపై అనుకూల దృక్పథంతో ఆలోచించాలి.

సమస్యల పరిష్కారం..

ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఎంత క్షుణ్ణంగా తెలిసినా, ఎంత పట్టు ఉన్నా పరిష్కారం కోసం వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదు. మొదట పరిష్కరించాల్సిన సమస్యల్లో సులభతరమైనవి ముందుగా విడదీయాలి. ప్రాధాన్యం ప్రకారం రాసుకుని ముందుకు వ్యక్తిగా చేయగలిగినవి, ఇతరుల సహాయంతో చేయగలిగేవి. ప్రభుత్వం ద్వారా చేయగలిగేవి చూసుకొని, విశ్లేషిస్తూ  పరిష్కారం చూపించాలి.

ఇలా ఉండాలి..

- నాయకుడు స్పష్టమైన లక్ష్యం, విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- వినయం, ఓర్పు, సహనం, సర్దుబాటు, మనస్తత్వం కలిగి ఉండాలి.
- ఆత్మవిశ్వాసం, ధైర్యం, చొరవ, దూరదృష్టి కలవాడై ఉండాలి.
- గ్రామాభివృద్ధిలో అన్ని వర్గాల వారిని, అన్ని పక్షాల వారిని కలుపుకొని పోవాలి.
- నాయకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని     సూటిగా, స్పష్టంగా చెప్పాలి.
- ఇతరులు చెప్పింది జాగ్రత్తగా విని. వారి సలహాలు స్వీకరించి అవి మంచివి అయితే వాటిని అమలు చేయాలి.
- ఏదైనా సమస్యల వచ్చినప్పుడు అన్నివర్గాల వారితో చర్చించి సమష్టి నిర్ణయం తీసుకోవాలి.
- గ్రామ సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలి.

ఇలా ఉండకూడదు..

- ఇతరుల పట్ల అధిపత్య ధోరణి ప్రదర్శించడం.
- ఇతరుల వ్యక్తిత్వంపై అనవసర వాఖ్యలు, విమర్శలు చేయడం
- అహంకారంతో అతి విశ్వాసంతో అసంపూర్ణ పరిజ్ఞానంతో ప్రవర్తించడం.
- సమావేశాల్లో వ్యక్తిగత దూషణలు చేయడం.
- తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం.
- ఘర్షణ వైఖరి అవలంభించడం.

మంచి చొరవ..

నాయకుడికి ఉండే ముఖ్య లక్షణాల్లో సాధారణంగా చొరవ, కలుపుగోలుతనం ముఖ్యం. కొందరు రెండు ఒక్కటే అనుకుంటారు. కానీ పరిచయాలు పెంచేది కలుపుగోలుతనం, సమస్యలపై పరిష్కారం కోసం మనల్ని ముందుకు నడిపించేది చొరవ.logo