Thammudu Movie | హీరో నితిన్‌కి, నిర్మాత దిల్ రాజుకి మంచి అనుబంధం ఉంది. నితిన్ హీరోగా ఆయన నిర్మించిన ‘దిల్’ సినిమానే వెంకట రమణా రెడ్డి అలియాస్ ‘దిల్’ రాజు ఇంటి పేరుగా మారిపోయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కి దిల్ సినిమా విజయం గొప్ప ప్రారంభం ఇచ్చింది. తర్వాత వీరి కలయికలో వచ్చిన శ్రీనివాస కళ్యాణం ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు వారి కాంబినేషన్లో ‘తమ్ముడు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. కొన్నాళ్లుగా ఓ మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నారు నితిన్. మరి తమ్ముడు ఆ విజయాన్ని ఇచ్చిందా? మరోసారి ‘దిల్’ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? నితిన్ కమ్‌బ్యాక్ ఇచ్చాడా? రివ్యూలో చూద్దాం.
కథ గురించి:
ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ కొట్టాలనేది జై (నితిన్) లక్ష్యం. అయితే తన మనసులో ఏదో వెలితి. దీనికి కారణం చిన్నప్పుడు తనని వదిలి వెళ్లిపోయిన అక్క ఝాన్సీ కిరణ్మయి (లయ). అక్కని కలసి తమ్ముడు అని పిలిపించుకొంటే గాని, తన వెలితి తగ్గదని జైకి అర్థం అవుతుంది. కట్ చేస్తే… అజర్వాల్ (సౌరబ్ సచ్దేవ్) గ్యాంగ్ కారణంగా ఝాన్సీ ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అసలు అజర్వాల్ ఎవరు? ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశాడు? ఝాన్సీ, జై ఎందుకు దూరమయ్యారు? ఝాన్సీని కాపాడటానికి జై ఎలాంటి పోరాటాలు చేశాడు? అనేది తక్కిన కథ.
కథ విశ్లేషణ:
అక్క కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఓ తమ్ముడి కథ ఇది. ఈ లైన్ వినగానే రొటీన్ అనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ కథని ఫ్యామిలీ ఎలిమెంట్‌తో యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా మలచాలనేది దర్శకుడు వేణు శ్రీరాం ఆలోచన. ఈ ఐడియా కొత్తగా ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లేలో ఆ కొత్తదనం కనిపించలేదు. అక్క-తమ్ముడు ఎమోషన్ ఆకట్టుకునేలా తెరపైకి రాలేదు. దీంతో తెరపై కనిపించిన యాక్షన్ ప్రేక్షకుడిని అంతలా హత్తుకోదు. యాక్షన్ ఎలివేట్ అయినంతగా ఎమోషన్ పండకపోవడం సమస్యగా మారింది.
ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సన్నివేశంతో కథ మొదలవుతుంది. దాని వెనుక ఉన్న విలన్ నేపథ్యం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్ ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాక్‌డ్రాప్ ఈ కథకు అంత సెట్ కాలేదు. విలన్-హీరో మధ్య సరైన సంఘర్షణ లేదు. ఇదే కాదు… ఇందులో ప్రధాన పాత్రల మధ్య కెమిస్ట్రీ ఉండదు. దీంతో తెరపై జరుగుతున్న సన్నివేశాలన్నీ ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించవు. ఈ సినిమా కోసం అంబర గొడుగు అనే ఓ ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌ని క్రియేట్ చేశాడు డైరెక్టర్. అక్కడ జరిగే యాక్షన్ కొంతమేరకు మెప్పిస్తాయి. అయితే అంబర గొడుగు ఎపిసోడ్ తర్వాత ఈ కథకు ‘శుభం’ కార్డ్ పడిపోవాలి. కానీ దీని తర్వాత కూడా కొంత సాగదీశారు. అది ఈ సినిమాకి ఏ మాత్రం కలిసిరాలేదు. అక్క తమ్ముడు మంచి ఎమోషన్. దీనిని యాక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్ లా తీర్చిదిద్దాలనే దర్శకుడి ఆలోచన బావున్నప్పటికీ.. కథ కథనం మీద ఇంకాస్త దృష్టి పెడితే సినిమా ఇంకా బెటర్ అయ్యేది. ముఖ్యంగా యాక్షన్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పై కంటే అక్క తమ్ముడి అనుబంధం మీద ఎక్కువగా కథను నడిపించి భావోద్వేగాల్ని పండిస్తే మంచి సినిమా గా నిలిచేది .
నటీనటుల గురించి:
జై పాత్రలో నితిన్ నటన మరీ అంత కొత్తగా లేదు. అయితే యాక్షన్ సన్నివేశాల్లో కష్టపడ్డాడు. తన కష్టం తెరపై కనిపిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత కనిపించిన లయ ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చింది. అయితే వారి ఎమోషన్ని బలంగా రాసుకోలేదు దర్శకుడు. వర్ష బొల్లమ్మ ఓ సీన్లో మెరుస్తుంది. సప్తమి గౌడ పాత్రతో చేకూరిన ప్రయోజనం ఏమీ లేదు. సౌరబ్ విలనిజం చివర్లో తేలిపోయింది. మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు.
టెక్నికల్‌గా:
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. దిల్ రాజు ఎక్కడా రాజీపడకుండా ఖర్చు చేశారు. అజ్నిస్ ఆర్.ఆర్. మరోసారి ఆకట్టుకుంది. యాక్షన్ సీన్స్‌ని ఎలివేట్ చేసింది. కెమెరావర్క్ డీసెంట్‌గా ఉంది. అంబర గొడుగు బ్యాక్‌డ్రాప్ విజువల్‌గా బావుంది. యాక్షన్ సీన్స్ బాగా తీర్చిదిద్దారు. దిల్ రాజు క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు.
ప్లస్ పాయింట్స్
• నితిన్, లయ
• యాక్షన్ సీన్స్
• నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
• రొటీన్ కథ, స్క్రీన్‌ప్లే
• బలహీనమైన ఎమోషన్స్
రేటింగ్: 2.5 /5