సమ్మర్ హాలీడేస్ మొదలుకావడంతో ఈ శుక్రవారం అర డజనుకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో చాలా వరకు చిన్న సినిమాలే ఉన్నాయి. వాటిలో ప్రియదర్శి సారంగపాణి జాతకం, సంపూర్ణేశ్ బాబు సోదరా సినిమాలు కాకుండా చెప్పుకోదగ్గ చిత్రం “మన ఇద్దరి ప్రేమకథ”. ఇక్బాల్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రంలో హీరో కూడా అతనే. ఇవాళ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం..
కథ ఏంటంటే..
నాని (ఇక్బాల్) ఒక అనాథ. అతను శృతి (మోనికా)ను చూసి ఇష్టపడతాడు. అదే విషయం శృతికి ప్రపోజ్ చేస్తే ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి ఒకసారి బీచ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. నాని, శృతి మధ్యలోకి అను (ప్రియా జస్పర్) వస్తుంది. అను రాక నాని, శృతి మధ్య రిలేషన్‌ను దెబ్బతీస్తుంది. ఆ సమయంలోనే నాని, అను ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది.
ఆ వీడియో చూసిన అక్కడి గ్రామస్తులు అను, నానికి పెళ్లి జరిపిస్తారు. శృతిని ప్రేమించిన నాని.. అనుకోకుండా పెళ్లి చేసుకున్న అనుతో కాపురం చేశాడా? అసలు అను ఎవరు? నాని జీవితంలోకి ఆమె ఎందుకొచ్చింది? పెళ్లి తర్వాత నాని జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇక్బాల్ రాసుకున్న కథ బాగుంది. దాన్ని తెరకెక్కించడంలోనూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సహజమైన లొకేషన్లలో సినిమాను చక్కగా చిత్రీకరించారు. ఒక అమ్మాయిని ప్రేమించి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి రావడం, ఆ పరిణామం ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేది చక్కగా చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే సీన్లు కొన్ని సాగదీసినట్లుగా ఉంటాయి. అవి ప్రేక్షకులు బోరింగ్‌గా ఫీలయ్యేలా చేస్తాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదునుపెట్టాల్సింది. క్లైమాక్స్ షాకింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులు కచ్చితంగా కొత్తగా ఫీలవుతారు. సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. సంగీత దర్శకుడు రాయన్ ఈ సినిమాకు పెద్ద అసెట్ అనుకోవచ్చు. లో బడ్జెట్లో సినిమా చేసినప్పటికీ నిర్మాణ విలువలు కొంతవరకు బాగానే ఉన్నాయి.
దర్శకుడిగానే కాకుండా హీరోగానూ ఇక్బాల్‌కు మంచి మార్కులే పడ్డాయి. పక్కింటి కుర్రాడి పాత్రలో ఇక్బాల్ నటన బాగుంది. హావభావాలు సహజంగా ఉన్నాయి. హీరోయిన్ ప్రియా జస్పర్ క్యూట్‌గా కనిపించింది. ఆమె పాత్రకు మంచి ప్రియారిటీ ఉంది. మరో హీరోయిన్ మోనికా కూడా తన పాత్రకు న్యాయం చేసింది.
బలాలు
+ క్లైమాక్స్
+ సినిమాటోగ్రఫీ
బలహీనతలు
– ఎడిటింగ్
– స్లో నెరేషన్
చివరగా.. ‘మన ఇద్దరి ప్రేమకథ’ కొత్తగా ఉంది
రేటింగ్: 2.75