Sir Movie Review | ఒకప్పుడు సందేశాత్మక కథలు కమర్షియల్గా చెప్తే ప్రేక్షకులు చూశారు. ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాలను కూడా అందించారు. కానీ ఇప్పుడు అవే కథలను కమర్షియలైజ్ చేసి మెసేజ్ ఇస్తుంటే క్లాస్ చెప్పకండి రా బాబు కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అంటున్నారు. అందుకే హీరోలందరూ మాస్ కథలు వైపు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి చదువును వ్యాపారంగా ఎలా మారుస్తున్నారు అనే కథను సార్ సినిమాలో చెప్పాడు. ఇది ఇప్పటివరకు మనం చూడని కథ కాదు. 30 సంవత్సరాల కింద జెంటిల్మెన్ సినిమాలోని శంకర్ ఈ కథ చెప్పాడు.
అప్పటి పరిస్థితులకు అది మోస్ట్ రిలవెంట్ స్టోరీ అనిపించింది కాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. అయితే 30 సంవత్సరాల తర్వాత కూడా వెంకీ అట్లూరి దాదాపు అదే కథ చెప్పాలని ప్రయత్నించాడు. కాకపోతే ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు దాన్ని మార్చాలని చూశాడు. ఈ క్రమంలో సగం వరకే సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముక్కలు ముక్కలుగా చూస్తే సార్ సినిమా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ఒక సినిమా పరంగా చూస్తే మాత్రం ఎక్కడో ఏదో తగ్గిన ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు ప్రేక్షకులు. కథపై నమ్మకంతో ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేశారు దర్శక నిర్మాతలు. సినిమాలో సబ్జెక్టు బాగానే ఉన్నా దాన్ని తీసిన విధానం మాత్రం పాత చింతకాయ పచ్చడి ఎలా ఉంది అంటూ పెదవి విరుస్తున్నారు విశ్లేషకులు. కొన్ని సన్నివేశాల వరకు మాత్రం వెంకీ అట్లూరి అద్భుతంగా రాసుకున్నాడు. దాంతోపాటు డైలాగులు కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.
అన్నింటికి మించి ధనుష్ యాక్టింగ్ సార్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. మొదటి నుంచి చివరి వరకు తన భుజాలపై సార్ సినిమాను మోశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రొటీన్ స్టోరీని తన నటనతో ఎంగేజింగ్ గా మార్చేశాడు ధనుష్. కాకపోతే మరీ తెలిసిన కథ కావడం.. దానికి తోడు రొటీన్ స్క్రీన్ ప్లే కూడా ఉండడంతో సార్ అక్కడక్కడ కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్న ఫీలింగ్ వస్తుంది. సినిమా అంతా ఊహించే సన్నివేశాలు ఉంటాయి. కాకపోతే ఒకటి మాత్రం నిజం ఈ సినిమాను కమర్షియల్ హక్కులకు తగ్గట్టు కాకుండా హానెస్ట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు వెంకీ అట్లూరి. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది.. ఇప్పటి జనరేషన్ కు ఈ కథ కరెక్ట్ అవుతుందా లేదా అనేది ఈ వీకెండ్ అయితే కానీ తేల్చలేము.