భీమదేవరపల్లి బ్రాంచి
నటీనటులు : సుధాకర్ రెడ్డి, కీర్తిలత, అభి, రూప, అంజిబాబు, రాజవ్వ, శుభోదయం సుబ్బారావు, సి.ఎస్.ఆర్ వివరెడ్డి, పద్మ, ప్రసన్న, మానుకోట ప్రసాద్, గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వల్లి, సత్యప్రకాష్, మహేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు
సంగీతం: చరణ్ అర్జున్
నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపల్లి
విడుదల తేదీ: 23 జూన్ 2023
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ భాషకు, యాసకు, నేపథ్యానికి సినీ పరిశ్రమలో ప్రాముఖ్యత పెరిగింది. ఒకప్పుడు తెలంగాణ సినిమా అంటే అభ్యుదయ సినిమా, ఆర్ట్ సినిమా స్థాయి నుంచి లేటెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ మంత్రగా తెలంగాణ సినిమా ఎదిగింది. ఇటీవల విడుదలై అందరి హృదయాలను హత్తుకుని కమర్షియల్‌గా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన బలగం తెలంగాణ సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటింది. ఈ కోవలోనే చాలా సినిమాలు తెలంగాణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్నాయి. ఆ జాబితాలోనే రూపొందిన మరో సినిమా భీమదేవర పల్లి బ్రాంచి. తెలంగాణ నేపథ్యం, యాసతో తెరకెక్కిన ఈ తాజా చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది…ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ సాధించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యిందో చూద్దాం..
కథ:
తెలంగాణలో భీమదేవరపల్లి అనే చిన్న ఊరిలో జంపన్న (అంజి) అమ్మ, భార్యతో నివసిస్తుంటాడు. చాలిచాలనీ డబ్బులతో జీవనం గడుపుతున్న అతనికి ఊరిలో కొన్ని అప్పులుంటాయి. అయితే ఒకరోజు అనుకోకుండా తన తల్లి సమ్మక్క (రాజవ్వ) బ్యాంక్ ఖాతాలో 15లక్షల రూపాయిలు జమ అవుతాయి. అయితే ఆకస్మాత్తుగా అంత డబ్బు పడటంతో అవి ఎక్కడి నుంచి వచ్చాయని కంగారు పడుతుండగా, ఆ ఊరిలో చదువుకున్న ఒక వ్యక్తి కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్ పథకం వల్లే నీకు మీ అకౌంట్లో డబ్బులు వచ్చాయని చెబుతాడు. అక్కడి నుంచి జంపన్న లైఫ్ైస్టెల్ను మారుస్తాడు. బ్యాంక్‌లోని డబ్బును డ్రా చేసి ఖర్చు పెట్టేస్తాడు. ఊళ్లో అందరి ఎదురుగా కాస్త డబ్బు అహంకారం, బిల్డప్‌లు ఇస్తాడు.. అప్పులు తీరుస్తాడు. కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దామని ఒకరి చేతిలో మోసపోతాడు. ఈలోగా మరో న్యూస్ తెలుస్తుంది.ఆ న్యూస్ ఏమిటి? దాని తరువాత జరిగిన పరిణామాలేమిటి? అసలు అకౌంట్లోకి డబ్బు ఎలా వచ్చింది అనేది మిగతా కథ.
కథా విశ్లేషణ:
తెలంగాణ నేపథ్యం, యాసతో రూపొందిన ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని నేడు సమాజంలో జరుగుతున్న సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని కథను రాసుకున్నాడు దర్శకుడు రమేష్ చెప్పాల. తను అనుకున్న విషయాన్ని చెప్పడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ప్రథమార్థాన్ని ఎక్కువగా కామెడీతో నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సెకండాఫ్‌లో ఎమోషన్ సీన్స్ కట్టిపడేస్తాయి. పతాక సన్నివేశాలు, సినిమా ముగించిన విధానం బాగుంది. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సక్సెస్ఫుల్ చిత్రాల జాబితాలో చేరడానికి కావాల్సిన అన్ని అంశాలు ఉన్న చిత్రమిది.
ప్రతి సన్నివేశంలో దర్శకుడి ప్రతిభ, సినిమా పట్ల నిర్మాత అభిరుచి స్పష్టంగా కనిపిస్తుంది. చరణ్ అర్జున్ సంగీతం, నేపథ్య సంగీతం కథను నడిపించడంలో సహాయపడింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సహజమైన నేపథ్యంతో, ఆకట్టుకునే పాత్రలతో రూపొందిన ఈ చిత్రాన్ని తప్పకుండా అందరూ కుటుంబసమేతంగా వీక్షించవచ్చు. వినోదంతో పాటు ప్రేక్షకులకు సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిన దర్శక, నిర్మాతలను అభినందించవచ్చు. ఈ సినిమా స్ఫూర్తితో తెలంగాణ నేపథ్యం, యాసతో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది.
+ప్లస్‌లు:
కథ, నేపథ్యం, వినోదం, భావోద్వేగ సన్నివేశాలు, క్లైమాక్స్
రేటింగ్: 3.25/5