వికారాబాద్ : అనంతగిరిలోని అనంతపద్మనాభస్వామి పెద్ద జాతరకు దూరప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో అనంతగిరి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కార్తీకమాసం అనంతపద్మనాభస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా ముత్యాలపందిరి ఉత్సవాన్ని అర్చకులు ఘనంగా జరిపించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజాలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అత్యంత పవిత్ర మాసమైన కార్తీక మాసంలో ఆలయం వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. జాతర సందర్భంగా వెలసిన రంగులరట్నం, చిన్నారులు ఆడుకునేందుకు పలు రకాల ఆట వస్తువులు వెలిశాయి.
అనంతగిరి అందాలైన వ్యూ పాయింట్, వాచ్‌టవర్, నందిఘాట్ వంటి ప్రదేశాల్లో పర్యాటకులు సరదాగ గడిపారు. అటవీ ప్రాంతంలో పలువురు పర్యాటకులు ట్రెక్కింగ్ చేశారు. వాతావరణం చల్లబడటంతో తెలంగాణ ఊటిలా తలపిస్తున్న అనంతగిరి కొండలను కట్టిపడేస్తున్నాయి. ఈ దృశ్యాలను చూస్తూ పర్యాటకులు సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నారు.