
బొంరాస్ పేట : జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు క్షయవ్యాధి నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రైపెండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా ఎక్స్రే ద్వారా క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారానికి మించి దగ్గు, జ్వరంతో బాధపడే వారు తెమడ పరీక్ష చేయించుకోవాలని, వ్యాధి నిర్ధారణ అయితే ప్రభుత్వ దవాఖానాలో ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని రవీంద్రయాదవ్ అన్నారు. రైపెండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో మూడు చోట్ల క్షయవ్యాధి నిర్ధారణ శిబిరాలు నిర్వహించామని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులు అందజేస్తున్నామని చెప్పారు. శనివారం 125మందికి ఎక్స్రే పరీక్షలు నిర్వహించగా 10మందికి క్షయవ్యాధి ఉన్నట్లు తేలింది.
వీరికి తెమడ, సీబీనాట్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తామని డాక్టర్ రవీంద్రయాదవ్ చెప్పారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ సాయి, సంస్థ సిబ్బంది రమేశ్, విజయేందర్, శివరాజ్, ఆయూష్ వైద్యురాలు అరుణ, పీహెచ్సీ సీహెచ్వో శివరాజ్, హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి, ఆయూష్, ఫార్మాసిస్టు సుదర్శన్ పాల్గొన్నారు.