పూడూరు : నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ ఎం.ఏ.రశీద్ పేర్కొన్నారు. శనివారం పూడూరు మండలం మన్నెగూడలో రాత్రి 100మంది పోలీసులతో 160 ఇండ్లల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన ధ్రువ పత్రాలు లేని 32 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను నడపడం నేరమని పేర్కొన్నారు. యువత మంచి మార్గాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ప్రధాన వీధుల గుండ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే గ్రామంలోకి వచ్చే వారి కదలికలు తెలుసుకోవచ్చన్నారు.
అనుమానితులు ఎవరైనా సంచరించినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు చూపించి తమ తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. కార్డెన్ సెర్చ్‌లో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ లక్ష్మిరెడ్డి, ఎస్సై శ్రీశైలం, సర్పంచ్ వినోద్‌గౌడ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.