సిటీబ్యూరో, మార్చి 28 ( నమస్తే తెలంగాణ): ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనాలకు అమర్చే స్టిక్కరింగ్ ప్రక్రియ రోజురోజుకూ వివాదస్పదమవుతున్నది. రేడియం స్టిక్కరింగ్ ధరలు రవాణాశాఖ అధికారులు అనూహ్యంగా పెంచింది. దీంతో వాహనదారులు రేడియం స్టిక్కరింగ్ అమర్చడానికి డబ్బులు లేవంటూ వెనుతిరిగిపోతున్నారు. కొన్ని కార్యాలయాల్లో అధికారులకు, వాహనదారుల మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ధరల విషయం తమకు సంబంధం లేదని ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్పగా, ఏజెన్సీలకు దోచిపెట్టేందుకు తమను బలి పశువులను చేయడం ఏంటని వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో స్టిక్కర్ గతంలో ఆర్టీసీ రూ.80 నుంచి 100 లోపు చేసిందని చెప్పారు. ఇప్పుడు రూ.500 పైనే వసూలు చేస్తున్నారని విమర్శించారు. స్టిక్కరింగ్ ప్రక్రియను 5 కంపెనీలకు ఆర్టీఏ అప్పగించింది. 37 మంది డీలర్లు కంపెనీల తరపున స్టిక్కరింగ్ ప్రాసెస్ చేయనున్నారు. అయితే ఆ కంపెనీలకు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం సహేతుకమైంది కాదన్నారు.
ఏడాదికోసారా..?
గతంలో రేడియం స్టిక్కర్లు వేసుకున్నాక మూడు సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు కేవలం ఏడాది మాత్రమే గ్యారెంటీ ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. అంత పెద్ద కంపెనీలు అని చెప్పే రవాణా శాఖ ఆ కంపెనీల స్టిక్కర్లను అమర్చుకుంటే కేవలం ఏడాది వ్యాలిడిటీ ఉండటం ఏంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు దండుకోవడమే లక్ష్యంగా ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అంతేకాదు స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తవడానికి ఒక్క రోజు సమయం కేటాయించాల్సి రావడం గమనార్హం. రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే ప్రతి వాహనానికీ ముందుగా కొలతలు తీస్తున్నారు.
ఆ తర్వాత స్టిక్కర్ వేస్తున్నారు. ఫొటోలు తీస్తున్నారు. ఫీజు చెల్లింపులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇవ్వన్నీ పూర్తయ్యాకనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ అవుతున్నది. ఈతంతంగం అంతా కేవలం ఆ కంపెనీలకు చెందిన స్టిక్కర్లు అమర్చుకోవడం కోసమేనని వాహనదారులు విమర్శిస్తున్నారు.
ధరలు తగ్గించకపోతే ఉద్యమిస్తాం
ఆర్టీఏ ఏజెన్సీలకు స్టిక్కరింగ్ ప్రక్రియ అప్పజెప్పి చోద్యం చూస్తున్నది. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఉచితంగా రేడియం స్టిక్కర్లు అమర్చాలి. మినీమం చార్జీలు వసూలు చేయడంలో తప్పులేదు. కానీ డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా ఏజెన్సీలకు దోచిపెడుతున్నది. గతంలో స్టిక్కరింగ్ ప్రక్రియను ఆర్టీసీ చేపట్టింది. అప్పు డు రూ.80 ఉంటే 120 చేస్తేనే పెద్ద ఎత్తున ఉద్యమించాం. ఇప్పుడు వేల రూపాయలు దండుకోవడం సరైనది కాదు. రవాణా శాఖ స్టిక్కరింగ్ ధరలను తక్షణమే తగ్గించాలి.
– సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఫెడరేషన్
స్థానికుల ఉపాధిని దెబ్బకొట్టొద్దు
రేడియం స్టిక్కర్లను నాలుగు విదేశీ కంపెనీలకు అప్పగించారు. ఆ కంపెనీల డీలర్లు ఇతర రాష్ర్టాలకు చెందినవారే అధికంగా ఉన్నారు. వారికి దోచిపెట్టేందుకు వాహనదారులపై అధిక భారం వేయాలా? ఇక్కడి కంపెనీలు లేవా? స్టిక్కరింగ్ వేసేందుకు ఇక్కడి వారు లేరా? స్థానికుల ఉపాధిని దెబ్బకొట్టేలా రవాణా శాఖ నిర్ణయాలు చేయడం సరైంది కాదు. ప్రభుత్వం పునఃఆలోచించి స్టిక్కర్ ధరలను తగ్గించాలి.
– వేముల మారయ్య, తెలంగాణ ఆటో యూనియన్ అధ్యక్షుడు