శంకర్పల్లి, జనవరి 1 : శంకర్పల్లి మండలం అలంఖాన్‌గూడ గ్రామంలో 20 సంవత్సరాల్లో జరుగని అభివృద్ధి పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత జరుగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పథకంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టారు సర్పంచ్ మౌనికారెడ్డి. అలంఖాన్గూడలో రూ.20లక్షలతో, అనుబంధ గ్రామమై చిన్నారెడ్డిగూడలో రూ.5లక్షలతో సీసీ రోడ్లను వేశారు. గ్రామంలో రూ.20 లక్షలు ఖర్చు చేసి పొడవైన సీసీ రోడ్లను వేశారు. అలాగే ఈ గ్రామానికి అనుబంధ గ్రామమైన చిన్నారెడ్డి గూడలో రూ.5 లక్షలతో సీసీ రోడ్లను వేశారు. రూ.12.60 లక్షలతో విశ్రాంతి గది, స్త్రీ, పురుషుల స్నానాలు గదులతో కూడిన వైకుంఠధామం, రూ.1.70 లక్షలతో డంపింగ్ యార్డు, నర్సరీ, మొక్కలకు నీరందించడానికి 5వేల లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేశారు. వంద శాతం మిషన్ భగీరథ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీనికోసం రూ.10 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించారు.
రూ.3 లక్షలతో అండర్ డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టారు. రూ.10 లక్షలతో మిగిలిపోయిన ప్రాంతాల్లో అండర్ డ్రైనేజీ మురికి కాలువలు నిర్మిస్తున్నారు. ట్రాక్టర్, ట్రాలీ, నీటి ట్యాంకు కొనుగోలు కోసం గ్రామపంచాయతీ నిధులు రూ.9 లక్షలను ఖర్చు చేశారు. పోగైన చెత్తాచెదారాన్ని ట్రాలీ సాయంతో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల వద్ద రూ.5 లక్షలతో వంట గదిని, అలంఖాన్‌గూడ గేటు వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం రూ.5 లక్షలతో షెడ్డును, రూ.2 లక్షలతో కల్వర్టును నిర్మించారు. చిన్నారెడ్డిగూడలో గల ప్రభుత్వ పాఠశాలలో రూ.లక్షతో గదుల మరమ్మతు పనులు చేయించారు. కాగా స్థానిక ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి సహకారంతో గ్రామంలో తాగునీటి కోసం ప్లాంటు పనులు జరుగుతున్నాయని, అలాగే రూ.1.50 లక్షలతో ఎంపీపీ సహకారంతో బోరు వేయిస్తామని సర్పంచ్ తెలిపారు. రూ.6 లక్షలతో అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తున్నామని.. ఆ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
కోటి రూపాయలతో అభివృద్ధి పనులు : మౌనికారెడ్డి, సర్పంచ్
గ్రామంలో సుమారు కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. కొన్ని పనులు పూర్తికాగా మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. ఎంపీపీ సహకారంతో గ్రామంలో వాటర్ ప్లాంటు ఏర్పాటవుతున్నది. రూ.1.50 లక్షలతో ఒక బోరు కూడా ఎంపీపీ వేయిస్తున్నారు. 20 సంవత్సరాలుగా జరుగని అభివృద్ధి పనులు మూడేండ్లలో జరిగాయి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం.