వికారాబాద్ జిల్లాలో కరెంట్ కోతలు పెరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే జరుగుతున్నది. ఎండల తీవ్రత పెరగడడంతో అనధికారిక విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. ఓ సమయమంటూ లేకుండా కరెంట్ కట్ చేస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా కరెంట్ లేకపోవడంతో త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా వేళల్లో కోతలు విధిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి కోతలు అధికమయ్యాయి. రోజుకు 15-20 సార్లు కరెంట్ కోతలు విధిస్తుండడం గమనార్హం. గృహాలకు విద్యుత్తు సరఫరాకు సంబంధించి మరీ దారుణంగా తయారైంది.
ఓ వైపు ఎండల తీవ్రత పెరిగి గత వారం రోజులుగా జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతోపాటు కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత పది, పదిహేను రోజులుగా రాత్రి వేళల్లో ఓ సమయమంటూ లేకుండా పదుల సార్లు కరెంట్ కట్ చేస్తున్నారు. అసలు కరెంట్ కోతలు లేవని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనధికారికంగా కరెంట్ కోతలు విధిస్తున్నది. మరోవైపు జిల్లాలో వ్యవసాయంతోపాటు గృహ వినియోగం, పరిశ్రమలకు రోజుకు ప్రస్తుతం 7.2 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతున్నట్లు అధికారులు లెక్కలు చెప్తున్నారు.
– వికారాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ)
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి సబ్బండ వర్గాలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు సరఫరాలోనూ రైతులకు అన్యాయం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వ్యవసాయానికి కరెంట్ కోతలు మొదలయ్యాయి.
ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించి అధికారికంగా నాలుగున్నర గంటలపాటు త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా కోతలు విధిస్తున్నారు. అనధికారికంగా ఓవర్ లోడ్ పేరిట ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారు. ఓ వైపు బోర్లు, బావుల్లో అడుగంటిపోతున్న భూగర్భజలాలకు తోడు కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో సాగు చేస్తున్న వరి తదితర పంటలకు బోర్లు, బావుల్లో ఉన్న నీటిని కూడా అందించలేక జిల్లాలో పంటలు ఎండిపోయిన పరిస్థితులున్నాయి.
గత కాంగ్రెస్ పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్న అన్నదాతలు
ఈ నెలాఖరుతోపాటు మేలో ఎండల తీవ్రత అధికంగా ఉండనున్న దృష్ట్యా కరెంట్ ఎప్పుడొస్తదోనని ఎదురుచూడాల్సిన పరిస్థితులు రానున్నాయి. కరెంట్ కోతలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను జిల్లా రైతాంగం గుర్తు చేసుకుంటున్నది. నాడు కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి 2-3 గంటలపాటు కరెంట్‌తో పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఎంతో మంది విద్యుద్ఘాతాలతో మృత్యువాత పడడంతోపాటు చాలా మంది రైతులు పంట పొలాలకు నీరు పెట్టేందుకు మోటర్లు ఆన్ చేయబోయి మృతిచెందారు. కరెంట్ కష్టాలతో బోర్లు, బావుల్లో నీరున్నా సాగు చేసుకోలేని పరిస్థితి దయనీయ పరిస్థితి నెలకొని ఉండేది. మరోవైపు పరిశ్రమలకు సంబంధించి కూడా పవర్ కట్స్ పెరిగాయి.
అప్పుడలా.. ఇప్పుడిలా..
గత ప్రభుత్వ హయాంలో నిరంతర విద్యుత్తు సరఫరాతో పరిశ్రమలను నెలకొల్పేందుకు క్యూ కడితే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు కోతలతో పరిశ్రమలు పవర్ హాలీడేలు ప్రకటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు రూ.303 కోట్లు ఖర్చు చేసి వ్యవసాయానికి 24 గంటలపాటు విజయవంతంగా విద్యుత్తును సరఫరా చేశారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరాకుగాను 11,617 కిలోమీటర్ల మేర 33కేవీ, 11కేవీ, ఎల్టీ సామర్థ్యంగల విద్యుత్తు లైన్ల వేయడంతోపాటు 13,145 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఏర్పాటైన అనంతరం నిరంతర విద్యుత్ సరఫరాతో 3.31 లక్షల ఎకరాల్లో జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నిరంతర విద్యుత్తు సరఫరాకు ముందు 3.30 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయా పంటల విస్తీర్ణం 2024 వరకు 6 లక్షల ఎకరాలకు పెరిగింది.