కూకటివేళ్లతో పెకిలించాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు
రంగంలోకి దిగిన పోలీస్, ఎక్సైజ్ శాఖలు
రవాణా, విక్రయాలపై కట్టడి
ఇప్పటికే రూ.కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లాలోని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పలుచోట్ల అవగాహన సదస్సులు
వికారాబాద్ జిల్లాలో నార్కోటిక్ సెల్ ఏర్పాటు
పూర్తిస్థాయిలో అడ్డుకోవడమే లక్ష్యంగా చర్యలు ముమ్మరం
పరిగి/ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 13 : డ్రగ్స్, గంజాయి, గుడుంబా, కొకైన్, గుట్కాలు, పాన్ మసాలాల వంటి నిషేధిత మత్తుపదార్థాలపై రాష్ట్ర సర్కార్ ఉక్కు పాదం మోపుతున్నది. ఈ దందాను కూకటివేళ్లతో సహా పెకిలించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోలీస్, ఎక్సైజ్ శాఖలు రంగంలోకి దిగాయి. వారం రోజులుగా ముమ్మరంగా తనిఖీలు చేస్తూ రవాణా, విక్రయాలను కట్టడి చేస్తున్నారు. ఓఆర్ఆర్(ఔటర్ రింగ్ రోడ్డు)పై నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటికే రూ.కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకుని, పలు పోలీస్స్టేషన్లలో కేసులను సైతం నమోదు చేశారు. కళాశాలల విద్యార్థులే టార్గెట్‌గా దందా కొనసాగుతుండడంతో రంగారెడ్డి జిల్లాలోని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పలుచోట్ల అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. వికారాబాద్ జిల్లాకు ఆనుకొని కర్ణాటక సరిహద్దు ఉండటం వల్ల రైలు మార్గంతో పాటు పక్క రాష్ట్రం నుంచి గంజాయి రవాణా కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండలం, మున్సిపాలిటీలో అవగాహన కల్పిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో నార్కోటిక్ సెల్ ఏర్పాటు చేసి, ఇన్చార్జిగా ఇన్స్పెక్టర్, కొంతమంది సిబ్బందినీ నియమించారు. పూర్తిస్థాయిలో గంజాయి, డ్రగ్స్‌ను రూపుమాపడమే లక్ష్యంగా పోలీస్, ఎక్సైజ్ శాఖలు ముందుకు సాగుతున్నాయి.
డ్రగ్స్, గంజాయి, గుడుంబా, కొకైన్ ఇతర నిషేధిత మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపుతూ యువతను పెడదోవ బారి నుంచి రక్షించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై జనవరి 28న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పది రోజులుగా ఎక్సైజ్, పోలీసు శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి. దీంతో ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు ఎక్కడికక్కడే కట్టడి చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఓవైపు వీటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే మరోవైపు దాడులను నిర్వహించడానికి ఈ రెండు శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. కొందరు వ్యాపారులు ఇంజినీరింగ్ కళాశాలలను కేంద్రంగా చేసుకుని గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల సరఫరాను కొనసాగిస్తున్నారు.
కళాశాలలే కేంద్రంగా..
ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, అబ్దుల్లాపూర్మెట్తోపాటు నగర శివారుల్లో పెద్దఎత్తున ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ర్టాలు, దేశాలకు చెందిన విద్యార్థులు కూడా విద్యనభ్యసిస్తున్నారు. అక్రమ వ్యాపారులు విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారు. ఇప్పటికే పలు కళాశాలల విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్‌ను సరఫరా చేసే నగరానికి చెందిన పలువురు వ్యాపారులను ఇటీవల ఇబ్రహీంపట్నం పరిధిలో అదుపులోకి తీసుకుని వారిపై కేసులు కూడా నమోదుచేశారు. దీంతో పోలీసులు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల్లో ముందుగా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఆయా కళాశాలల్లో డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఎక్కడికక్కడే అరికట్టడానికి చర్యలు
వికారాబాద్ జిల్లా పరిధిలో గత సంవత్సరం పోలీసులు గంజాయికి సంబంధించి 12 కేసులు నమోదు చేయగా ఎక్సైజ్ వారు మరో 8 కేసులు నమోదు చేశారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 3 గంజాయి కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా గంజాయిని పొలాల్లో సాగు చేస్తుండడంతో ముందుగా దీన్ని అరికట్టేందుకు సర్కారు చర్యలు తీసుకుంది. ఎవరైనా గంజాయి సాగు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు సంబంధిత పొలం వారికి రైతు బంధు కట్ చేస్తారు. ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గంజాయి సాగు ఎక్కడైనా జరుగుతుందా అని తెలుసుకునేందుకు మరో ప్రభుత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నారు. దీంతోపాటు ఇతర మార్గాల ద్వారా గంజాయి సాగు, రవాణాకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచార సేకరణ జరుపుతున్నారు. గంజాయి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు వాటి రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడంపై దృష్టి సారించారు. రైల్వే పోలీసులతో కలిసి తరచుగా తనిఖీలు జరపడం వంటివి చేపట్టడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
వికారాబాద్ జిల్లాకు ఆనుకొని కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి. ఓవైపు రైలుమార్గంతోపాటు పక్కనున్న రాష్ట్రం నుంచి గంజాయి జిల్లాలోకి రవాణా కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. తరచుగా సరిహద్దులో తనిఖీలు చేపట్టడం ద్వారా గంజాయిని అరికట్టడం కోసం కృషి జరుగుతున్నది. గుట్కాలు, పాన్ మసాలాలు విక్రయించే స్థలాల్లో తరచుగా పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం ద్వారా గంజాయిని అరికట్టడానికి ప్రతి మండలం, మున్సిపాలిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి జిల్లా పరిధిలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
ఓఆర్ఆర్పై ప్రత్యేక చెక్‌పోస్టులు
జంట కమిషనర్రేట్ల పరిధిలోని రంగారెడ్డిజిల్లాలో సుమారు 45వరకు ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. వీటితోపాటు, ఓఆర్ఆర్పై గంజాయి రవాణాపై కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు పెద్దఎత్తున గంజాయిని సరఫరా చేసే ముఠా ఓఆర్ఆర్ను కేంద్రంగా చేసుకుని తరలిస్తున్నది. దీనిపై దృష్టి సారించిన రాచకొండ పోలీసు అధికారులు ఇప్పటికే అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, ఆదిబట్ల తదితర పోలీసుస్టేషన్లల్లో పెద్దఎత్తున కేసులు కూడా నమోదుచేశారు. ఓఆర్ఆర్పై ప్రతి రెండు రోజులకోసారి ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల తనిఖీ ద్వారా గంజాయి, నిషేధిత గుట్కా పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సుమారు పది వరకు కేసులు నమోదు చేశారు. కోట్లాది రూపాయల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదిబట్ల పోలీసుస్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై నాలుగు కేసులు నమోదు చేయడంతోపాటు క్వింటాలుకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో రెండు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుస్టేషన్ పరిధిలో రెండు, రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో 3 కేసులను పోలీసులు నమోదు చేశారు.
అవగాహన సదస్సులు
ఇప్పటికే పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు ప్రజాప్రతినిధులకు పెద్దఎత్తున అవగాహన కల్పించినట్లు ఏసీపీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆదిబట్ల పోలీసుస్టేషన్ల పరిధిలోని ప్రజాప్రతినిధులతోపాటు పోలీసు, ఎక్సైజ్ సిబ్బంది, పార్టీల నేతలను భాగస్వాములను చేస్తూ డ్రగ్స్‌తో మానవ వనరులు ఎలా ధ్వంసమవుతున్నాయో వివరించారు. వీటిని అరికట్టడంలో పోలీసు, ఎక్సైజ్ శాఖలతోపాటు ప్రజాప్రతినిధులు, స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నేతలంతా తమవంతు పాత్ర ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
గంజాయిని అరికట్టేందుకు చర్యలు
– ఎన్.కోటిరెడ్డి, వికారాబాద్ జిల్లా ఎస్పీ
జిల్లా పరిధిలో గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. గంజాయి సాగుపై పూర్తిస్థాయిలో సమాచార సేకరణ చేపట్టి దాడులు నిర్వహిస్తున్నాం. గంజాయి రవాణాపై సైతం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం.
డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
– బాలకృష్ణారెడ్డి, ఏసీపీ, ఇబ్రహీంపట్నం
గంజాయి అక్రమ రవాణా అరికట్టడంపై సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం పోలీసుశాఖ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టడంతో పాటు పెద్దఎత్తున గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టగలుగుతున్నాం. విజయవాడ జాతీయ రహదారి, బొంగుళూరు ఔటర్‌రింగ్‌రోడ్డుతో పాటు ఇతర ప్రధాన రహదారుల వెంబడి ప్రతిరోజూ క్రమం తప్పకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశాం.