బడంగ్‌పేట, డిసెంబర్ 14 : విజ్ఙాన శాస్త్ర ఫలాలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుందని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. రంగారెడ్డి జిల్లాస్థాయి 50వ సైన్స్, మ్యాథమెటిక్స్, పర్యావరణ, ఇన్స్పైర్ ప్రదర్శనను బుధవారం ఆయన నాదర్గుల్లోని వంశీధర్ స్కూల్లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వంశీధర్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్య ప్రదర్శన, చదువు ప్రాముఖ్యత., హయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే ప్రదర్శింపబడిన నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. జిల్లా ఎన్సీసీ క్యాండెట్స్ యూనిట్ ఇచ్చిన గౌరవ వందనాన్ని ప్రతీక్‌జైన్ స్వీకరించారు. అనంతరం సైన్స్ ప్రదర్శనను పరిశీలించారు. వ్యవసాయ పరికరాలు, ప్రథమ చికిత్స, ఆలోమీటర్, స్మార్ట్ కాలనీ వంటి ప్రాజెక్టుల నమూనాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.
ప్రతిభను కనబర్చాలి
సమావేశంలో ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునీకరణను సంతరించుకుని తమ ప్రతిభను కనపర్చాలన్నారు. భవిష్యత్‌లో సైంటిస్టులుగా ఎదగాలన్నారు. మన ఇల్లే ఒక విజ్ఙాన ప్రయోగశాల వంటిదని.. అక్కడి నుంచి ఆవిష్కరణలు ప్రారంభమవుతాయన్నారు. విశ్లేషణాత్మక ఆలోచనలు బాల్య దశ నుంచి అలవాటు చేసుకోవాలని సూచించారు. భావితరాలకు ఏమైనా ఇవ్వాలనే విధంగా ఆలోచనలు ఉండాలన్నారు.
ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసి.. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చి.. వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. చరిత్రలో చిరస్థాయిలుగా నిలువాలంటే శాస్త్రవేత్తలుగా తయారు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గణిత, వైజ్ఙానిక పర్యావరణ ప్రాజెక్టులు 285, 93 ఇన్స్పైర్ ప్రదర్శనలు నిర్వహించినట్లు జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. కార్యక్రమంలో బాలల సైన్స్ కో ఆర్డినేటర్ రాజిరెడ్డి, డీసీఈబీ సెక్రటరీ రామచంద్రారెడ్డి, డీఈవో సుశీందర్‌రావు, ఎంఈవో కృష్ణయ్య, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత, కార్పొరేటర్ సునీత, వంశీధర్ పాఠశాల చైర్మన్ కృష్ణారెడ్డి, పాఠశాల డీన్ గోదాలక్ష్మీ, అకాడమిక్ ఇన్చార్జి మధు, ప్రిన్సిపాల్ గోపాల కృష్ణ, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులున్నారు.