బొంరాస్‌పేట, ఫిబ్రవరి 21 : పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఈ ఏడాది విద్యాశాఖ మార్పులు చేసింది. కరోనాకు ముందు ఆరు సబ్జెక్టులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించేవారు. కొవిడ్ కారణంగా గత ఏడాది పాఠశాలలు సెప్టెంబర్ నుంచి పునఃప్రారంభం కావడంతో సిలబస్‌ను తగ్గించి ఆరు పేపర్లతోనే పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది కూడా ఆరు పేపర్లతోనే(పూర్తి సిలబస్‌తో) వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రశ్నలు ఇచ్చే విధానం, ఛాయిస్‌లో మార్పులు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఏటా వార్షిక పరీక్షలకు ముందు మాత్రమే ఒకసారి ప్రీ-ఫైనల్ పరీక్షలను నిర్వహించేవారు. కానీ పరీక్షల నిర్వహణలో మార్పులు చోటు చేసుకున్న కారణంగా విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కోసం విద్యాశాఖ ప్రీ ఫైనల్-1 పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి నిర్వహించనుంది. ఏప్రిల్ 3 నుంచి జరిగే ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు, ప్రీ-ఫైనల్ పరీక్షా విధానం ఒకే విధంగా ఉండనున్నాయి. దీంతో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఎస్సెస్సీ పరీక్షల్లో ఉత్తమ ఫలితా సాధనకు గత ఏడాది డిసెంబర్ నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
పరీక్షలపై పూర్తి పట్టు కల్పించడానికి..
పరీక్షలపై పూర్తి పట్టు కల్పించడానికి విద్యార్థులకు ఈ నెల 22 నుంచి 28 వరకు మొదటి విడుత, మార్చి 14 నుంచి ప్రీ-ఫైనల్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. గత ఏడాది సగం ప్రశ్నలకే జవాబులు రాయాల్సి ఉండగా ఈసారి ఒక సెక్షన్ వ్యాసరూప ప్రశ్నల్లో మాత్రమే ఛాయిస్ ఇవ్వనున్నారు. పరీక్షలో మొత్తం 80 మార్కులుకాగా మిగతా 20 మార్కులు నాలుగు ఫార్మెటివ్(ఎఫ్ఏ) పరీక్షల్లో వచ్చిన మార్కుల సరాసరి తీసుకుని కలుపుతారు. పాఠ్యాంశాల నుంచి వచ్చే ప్రశ్నలు, ఛాయిస్ ఎలా ఉంటుంది, ప్రశ్నాపత్రం ఎలా ఉంటుంది, ఏయే పాఠాలు చదివితే మంచి మార్కులు సాధించవచ్చనే సందేహాలకు విద్యార్థులు లోనవుతుంటారు. ప్రీ-ఫైనల్ పరీక్షలపై అవగాహన కల్పిస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో విద్యాశాఖ వీటిని నిర్వహిస్తున్నది. ఈ పరీక్షలు వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.
ప్రశ్నాపత్రం ఉపాధ్యాయులే తయారుచేసుకోవచ్చు
పీ-ఫైనల్-1 పరీక్షలకు ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులే తయారు చేసుకోవచ్చు. సిలబస్ పూర్తయి రివిజన్ ఎంత వరకు పూర్తయిందో అవే పాఠాల నుంచి ప్రశ్నాపత్రాలను తయారు చేయాలని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి కూడా ప్రశ్నాపత్రాల బ్లూప్రింట్‌ను పంపించారు. వీటిని కూడా జిరాక్స్ చేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించుకోవచ్చు. మార్చిలో నిర్వహించే ప్రీ-ఫైనల్ పరీక్షలకు జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థ(డీసీఈబి) నుంచి ప్రశ్నాపత్రాలు తయారు చేసి పంపిస్తారు. ఈ ఏడాది వార్షిక పరీక్షలకు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రంలో ఒక్కో పేపర్ చొప్పున ఆరు పేపర్లు ఉంటాయి.
ఉదయం పరీక్ష, సాయంత్రం చర్చ
ప్రీ-ఫైనల్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ఎంఈవోలకు పలు సూచనలు జారీ చేసింది. ఉదయం పరీక్ష నిర్వహించి సాయంత్రం దానిపై చర్చ నిర్వహించాలి. ప్రశ్నాపత్రం ఎలా ఉంది, జవాబులు ఎలా రాశారు అనే విషయాలపై విద్యార్థుల అభిప్రాయాలను ఉపాధ్యాయులు తెలుసుకుని ఎక్కడ వెనుకబడ్డారో, ఎక్కడ లోపం ఉందో తెలుసుకుని సరిదిద్దాలి. ఇదిలా ఉండగా వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది 13,324 మంది విద్యార్థులు ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6801 మంది బాలురు, 6523 మంది బాలికలున్నారు.
విద్యార్థులకు ఎంతో ఉపయోగం
– రేణుకాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారిణి
ప్రీ-ఫైనల్-1 పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగం. ఇది పాఠశాలల్లో నిర్వహించే టెస్టుల మాదిరిగానే ఉంటుంది. పేపర్ ఎట్లా ఉంటుందో తెలుసుకుని వాటిపై అవగాహన పెంచుకోవడానికి ఈ పరీక్షలు ఎంతో దోహదం చేస్తాయి. సిలబస్ ఎంత వరకు రివిజన్ చేశారో అంతవరకే ప్రశ్నాపత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం. ఈ పరీక్షల అనంతరం మార్చి 14 నుంచి ప్రీ-ఫైనల్-2 పరీక్షలను నిర్వహిస్తాం.