సిటీబ్యూరో, జనవరి 25 ( నమస్తే తెలంగాణ ) : కార్ల రిజస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లా టాప్ గేర్లో దూసుకెళ్తున్నది. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక 2021-22 ప్రకారం 38,074 కార్లతో జిల్లా అగ్ర స్థానంలో నిలువగా తర్వాతి స్థానంలో మేడల్చ్ మల్కాజిగిరి , హైదరాబాద్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అలాగే వివిధ వాహనాల రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా వాహనాలు రిజిస్ట్రేషన్ అయిన జిల్లాగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుంది.
2021-22లో 1.43లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ వివరాలను తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక వెల్లడించింది. తర్వాత స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి నిలిచింది. 1.27లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. రంగారెడ్డి 1.24లక్షల వాహనాలతో మూడో స్థానంలో ఉంది. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక తెలంగాణలో గత ఏడాది రిజిస్ట్రేషన్ అయిన వాహనాల వివరాలను వెల్లడించింది.
ఈ మేరకు రాష్ట్రం మొత్తంలో 8.79లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అవగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 3,94,476 వాహనాలు రిజిస్ట్రేషన్ కావడం విశేషం. ఇందులో అధికంగా 3,49,500 నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంతేకాదు గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ కూడా పెరిగింది. మూడు జిల్లాలు కలిపి 15,673 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ ఇలా..
జిల్లా : ద్విచక్రాలు కార్లు : ట్రాన్స్పోర్ట్ : నాన్ ట్రాన్స్పోర్ట్ : ఎలక్ట్రిక్ : మొత్తం
హైదరాబాద్ : 97,204 : 27,677 : 8,794 : 1,25,091 : 9,161 : 1,43,046
మేడ్చల్-మల్కాజిగిరి : 79,958 : 33,574 : 6.926 : 1,13,957 : 6,483 : 1,27,366
రంగారెడ్డి : 71,278 : 38,074 : 7,641 : 1,10,594 : 5,829 : 1,24,064