నాటిన ఆరు నెలల నుంచి..
ఐదేండ్ల వరకు దిగుబడి
చేవెళ్లటౌన్, సెప్టెంబర్ 6 : గులాబీ పూల సాగు రైతులకు లాభాలను కురిపిస్తున్నది. చేవెళ్ల మండలంలోని ఖానాపూర్, ఘనపూర్, ధర్మసాగర్, ఎర్రవల్లి, చన్వల్లి, కందవాడ, దేవరంపల్లి, ఆలూర్, చేవెళ్ల తదితర గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు గులాబీ పూల సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గులాబీ పంటల సాగులో అనుకూలమని రైతులు చెబుతున్నారు. నేడు రైతులు నాటి సంప్రదాయక వ్యవసాయ విధానాలకు స్వస్తి పలుకుతూ నవీన వ్యవసాయ విధానాలతో పంటల సాగుకు మక్కువ చూపుతున్నారు. నీటి పారుదలకు కాలువలు ద్వారా పంట పొలాలకు నీరందించే విధానాలకు స్వస్తి పలికి డ్రిప్ ద్వారా నీటిని గులాబీ పంటలకు అందజేస్తున్నారు. రైతుల అభిరుచికి అనుగుణంగా పంటలను సాగు చేస్తున్నారు. స్టార్లైట్ (బుల్లెట్ ) గులాబీ ఎకరాకు 2000 మొక్కలు అవసరమవుతున్నాయి. వీటిని బెంగళూర్ నుంచి లేదా నర్సరీల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఒక మొక్క రూ.18లకే లభిస్తుంది. రవాణా తదితర ఖర్చులతో పొలంలోకి వచ్చేసరికి ఒక్కక్క మొక్కకు రూ.20లు పడుతుంది.
ప్రభుత్వం విద్యుత్ ఉచితంగా ఇవ్వడంతో బోరు బావుల కింద రైతులు అధికంగా పంటలను సాగుచేస్తున్నారు. ఎకరం గులాబీ పంటపెట్టుబడికి 60 నుంచి 70వేల రూపాయలు ఖర్చు అవుతుంది. నాటిన ఆరు నెలల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. ఒక రైతు కనీసం రెండెకరాలకు తక్కువ కాకుండా గులాబీతోటలను సాగుచేసినప్పుడే గిట్టుబాటు అవుతుంది. రెండు ఎకరాలకు పది మంది కూలీలు సరిపోతారు. సంవత్సరంలో 6నెలల పూలదిగుబడి బాగుంటుంది. హైదరాబాద్లో పూలకు పెద్ద మార్కెట్ ఉంది. స్థానిక రైతులు నగరంలోని గుడిమల్కాపూర్ పూలమార్కెట్కు తరలిస్తారు. ప్రతి రోజూ ఉదయం 7గంటలలోపు పూలను మార్కెట్కు తీసుకెళ్లాలి. ఉదయం 3గంటల నుంచి 6గంటల్లోపు పూలను కోసి మార్కెట్కు తరలిస్తే మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కిలో గులాబీ రూ.80 ధర రైతులకు చెల్లిస్తున్నారు. ఎకరానికి రోజుకు 30 నుంచి 40 కిలోల దిగుబడి సాధించవచ్చు. ఈ పూలను పూలమాలలు తయారీ, సుగంధతైలం తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

గులాబీతో మంచి లాభాలు
మూడు సంవత్సరాలుగా గులాబీ తోటను సాగు చేస్తున్నా. మంచి లాభాలు వస్తున్నాయి. 50 నుంచి 80 రూపాయల వరకు ధర పలుకుతుంది. డ్రిప్ సాగుతో ఈ పంటలను సాగు చేస్తున్నాం. మంచి దిగుబడి వస్తున్నది.
– వెంకట్రెడ్డి, రైతు ఖానాపూర్